వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, అక్టోబర్ 18: జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, నీటి పారుదల, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నారు. పరిగి, దోమ, పూడూరు మండలాల్లో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. కులకచర్ల మండలంలో వెంటనే స్థలాన్ని సేకరించాలని, టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నవాబుపేట మండలంలో జీప్లస్ 2 నిర్మాణ పనులు చేపట్టేందుకు స్థానిక సర్పంచ్, తహసీల్దార్లను సంప్రదించి, పనులు వేగవంతం చేయాలన్నారు. వికారాబాద్, మర్పల్లి మండలాల్లో పురోగతిలో ఉన్న పనులను 2022 ఫిబ్రవరి వరకు, మోమిన్‌పేట్‌లో ఏప్రిల్ వరకు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. వికారాబాద్ రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, రైల్వే శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టాలన్నారు. సిద్దులూరు బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్‌కుమార్, నీటి పారుదల శాఖ ఈఈ సుందర్, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాంరెడ్డి పాల్గొన్నారు.