పరిగి, అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా పరిధిలో పత్తి కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం ఇప్పటినుంచే అవసరమైన మేరకు ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు మద్దతు లభించడంతోపాటు సాధ్యమైనంత త్వరగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయి. ఈసారి 10 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అదనంగా మరో కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈసారి వానకాలంలో 1,89,827 ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఇందుకు సంబంధించి 2,02,464 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకనుగుణంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతున్నారు. గత సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నులకు పైగా పత్తిని కొనుగోలు చేశారు. ఈసారి ఎక్కడా రైతులకు ఇబ్బంది కలుగకుండా పత్తి కొనుగోలు కోసం మార్కెటింగ్ శాఖ వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాలు
పత్తి కొనుగోలుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు ప్రాంతంలోని శుభం ఇండస్ట్రీస్, మారుతి ఇండస్ట్రీస్, బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్, వికారాబాద్ ప్రాంతంలోని సాయిబాబా ఆగ్రో టెక్, ధరణి కాటన్ మిల్, అయ్యప్ప కాటన్ ఇండస్ట్రీస్, పరిగి ప్రాంతంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, కోట్‌పల్లి ప్రాంతంలోని సుమిత్ర కాటన్ ఇండస్ట్రీస్, సాయిబాబా ఆగ్రో ఇండస్ట్రీస్, కొడంగల్ ప్రాంతంలో విజయ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలు చేపడుతారు. పది కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 4,060 బేళ్ల పత్తిని కొనుగోలు చేయడానికి అవసరమైన సామర్థ్యం ఉన్నాయి. ఇందుకనుగుణంగా ఆయా ప్రాంతాల్లో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తారు. వీటితోపాటు ఈసారి జిల్లాలో మరొక కొనుగోలు కేంద్రం సైతం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. మరో జిన్నింగ్ మిల్లు పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే నోటిఫైడ్ పూర్తి చేసుకొని పత్తి కొనుగోలుకు సంబంధిత జిన్నింగ్ మిల్లు యజమానులు కసరత్తు జరుపుతున్నారు.
పత్తి క్వింటాలు మద్దతు ధర రూ.6025
పత్తి తేమ 8శాతం ఉండి, పొడవు పింజ రకానికి రూ.6025, పింజ రకానికి(మేచ్) రూ.5925 క్వింటాలుకు మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం 9 ఉంటే రూ.5964.75 నుంచి రూ.5865.75, తేమ శాతం 6 నుంచి 7శాతం లోపు ఉంటే సీసీఐ వారు బోనస్ సైతం చెల్లిస్తారు. 6శాతం తేమకు పొడవు పింజ రకానికి రూ.120.50 నుంచి పింజర రకానికి రూ.118.50 అదనంగా ఇస్తారు. 7శాతం తేమకు రూ.60.25 నుంచి రూ.59.25 వరకు చెల్లిస్తారు.
కొనుగోలు కేంద్రంలో సీసీఐ, మార్కెటింగ్ అధికారులు
ప్రతి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులతోపాటు సంబంధిత మార్కెట్ కమిటీలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు ఉంటారు. తూకాల వద్ద సైతం ఎలాంటి అవకతవకలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి తూకాల్లో మోసం జరుగకుండా లీగల్ మెట్రాలజీ అధికారులచే తనిఖీలు జరుపుతారు. అగ్నిమాపక యంత్రాంగం సైతం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నారు.
పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు