పరిగి : యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేయడంతో, కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చావుడప్పు కొట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల దుస్తులు ధరించి నిరసన ర్యాలీలలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర చట్టం తీసుకురావాలని, యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగిలో వినూత్నంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించడంతో పాటు గాడిదకు వినతిపత్రం అందజేశారు.
జిల్లా పరిధిలోని కోట్‌పల్లిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, వికారాబాద్, మోమిన్‌పేట్‌లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నవాబుపేట్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా కేంద్రంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, పరిగిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.