పరిగి : 18 సంవత్సరాలు నిండిన వారందరూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు చంపాలాల్, ఐఏఎస్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ నిఖిలతో పాటు రెవెన్యూ అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సర ఓటరు జాబితాలో సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 01.01.2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేయించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. చనిపోయిన వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి ఫారం-7 ద్వారా వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలని తెలిపారు. ఒక వ్యక్తి పేరు వేరు వేరు రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటరుగా నమోదు కాబడితే ఫారం-8 ద్వారా సరి చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 1నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, అక్షేపణలు ఉంటే స్థానిక ఆర్డీవో, తాసిల్దార్లను సంప్రదించాలని తెలిపారు.
తప్పలు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని సంగం లక్ష్మిబాయి ఉన్నత పాఠశాలలోని శివారెడ్డిపేట, నస్కల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బీఎల్వో, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సెక్రేటరీలతో మాట్లాడి నమోదు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, స్విప్ నోడల్ అధికారి కోటాజీ, వికారాబాద్, తాండూర్ ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌లతో పాటు తాసిల్దార్లు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.