పరిగి : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌లతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెరియంట్ ఒమిక్రాన్ వచ్చినందున మూడో దశ ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలని సూచించారు.
తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాలు గుర్తించి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి పోటీ తత్వం పెంచాల్సిందిగా మంత్రి సూచించారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మనమందరం మొదటి, రెండు దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మూడో దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడవ దశను ఎదుర్కొనడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అసత్య ప్రచారాలు, అపోహలు ప్రజలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మీకు అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
జిల్లాలో ఎన్ని బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం ప్రజలకు అందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున గురుకులాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల విద్యా శాఖ అధికారులకు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ రెండు డోసులు వ్యాక్సినేషన్ తీసుకున్నారని చెప్పారు. విద్యా సంస్థలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. 18సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోసు 82శాతం పూర్తి చేయడం జరిగిందని, రెండో డోసు 20శాతం పూర్తయిందన్నారు. మొదటి డోసు టీకా వేయించుకొని రెండవ డోసుకు అర్హులైన 27,646 మందికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందరికీ గురువారం నుంచి వ్యాక్సినేషన్ చేస్తామని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయడానికి ప్రతి రోజు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాం, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.