పరిగి : పరిగి పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శనివారం క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరిగి పట్టణంలోని పలు చర్చిలతో పాటు రాఘవాపూర్ చర్చిలోని ప్రత్యేక ప్రార్థనల్లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశాయన్నారు. తుంకులగడ్డ స్ముర్న ఫెయిత్ చర్చిలో అభివృద్ధి పనులకు, రాఘవాపూర్ చర్చికి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఉంటూ జీవనం సాగించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కేక్‌కట్ చేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ జడ్పీటీసీ చంద్రయ్య, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్‌రెడ్డి, ఫాస్టర్లు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.