బొంరాస్‌పేట, సెప్టెంబర్ 11 : వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటను అన్నదాతలు సా గు చేశారు. గత కొన్నేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. అదునుకు వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండడం, బోర్లలో నీటిమట్టం పెరగడంతో రైతులు వరి సాగును ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టారు. అయితే ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి ఆగస్టు వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో వరిసాగుపై అన్నదాతలు కొంత వెనుకడుగు వేశారు.
అయి నా బోర్లలో ఉన్న నీటిని నమ్ముకుని వరినాట్లు వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో వరిసాగు మూడు వేల ఎకరాలు తగ్గింది. జిల్లాలోని అన్ని మండలాల్లో నూ సాగు విస్తీర్ణం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నా యి. బొంరాస్‌పేట మండలంలో ఈ ఏడాది కూడా రైతులు అత్యధికంగా వరి పంటను సాగు చేయగా కోట్‌పల్లి మండలంలో అతి తక్కువగా 50 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఆగస్టు చివర, సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. వ్యవసాయ బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. ఇవే భారీ వర్షాలు జూలై, ఆగస్టు నెలల్లో కురిసి ఉంటే వరిసాగు విస్తీర్ణం మరింతగా పెరిగేది. భారీ వర్షాలకు నిండిన చెరువులతో యాసంగిలో వరిసాగుకు ఢోకా లేదని రైతులు భావిస్తున్నారు.
బొంరాస్‌పేట మండలంలో అత్యధికంగా..
ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని రైతులు 1.30 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. కొడంగల్ డివిజన్లోని బొంరాస్‌పేట మండలంలో 20,514 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 16,123, కొడంగల్‌లో 8,500, పరిగి డివిజన్లోని చౌడాపూర్ మండలంలో 7,100, దోమ మండలంలో 15,981, కులకచర్లలో 15,000, పరిగిలో 8,191, పూడూరులో 604, తాండూరు డివిజన్లోని బషీరాబాద్ మండలంలో 5,800, పెద్ద్దేముల్లో 5,199, తాండూరులో 5,340, యాలాల మండలంలో 13,625, వికారాబాద్ డివిజన్లోని బంట్వారంలో 215, ధారూరులో 5,700, కోట్‌పల్లిలో 50, మర్పల్లిలో 78, మోమిన్‌పేటలో 650, నవాబుపేటలో 390, వికారాబాద్ మండలంలో 940 ఎకరాల్లో పంట సాగైంది.