వికారాబాద్ జిల్లాలో ‘కడుపుకోత’లు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తిపడి సిజేరియన్లకు తెగబడుతున్నాయి. సాధారణ కాన్పులకు అవకాశమున్నా.. ఏదో ఒక సాకు చెబుతూ అందినకాడికి దండుకుంటున్నాయి. కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని.. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, లేదంటే తల్లీబిడ్డలకు ప్రమాదమని చెప్పి గర్భిణుల బంధువులను భయపెట్టేస్తున్నాయి.
-వికారాబాద్, డిసెంబర్ 21
దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా యి. అయితే అవి ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలు పట్టించుకోవడంలేదు. వికారాబాద్ జిల్లాలో దవాఖానలు, ల్యాబ్‌లు అన్నీ కలిపి దాదాపు గా 180 వరకు ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఒక్క నవంబర్ నెలలోనే జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానల్లో దాదాపుగా 320 డెలివరీలు జరిగాయి. అం దులో 43 సాధారణ ప్రసవాలు కాగా మిగిలిన 277 సిజేరియన్లు ఉన్నాయి.
ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు అధికంగా ‘కడుపుకోత’లను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. 2024 జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 5,596 నార్మల్ డెలివరీలు, 3,352 సిజేరియన్లు జరిగాయి. అదేవిధంగా ప్రైవేట్ దవాఖానల్లో 637 సాధారణ ప్రసవాలు కాగా.. 2,851 సిజేరియన్లు అయ్యాయి. జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సాధారణ ప్రసవాలకు అవకాశమున్నా చేయడం లేదు.
కడుపు లో బిడ్డ ఉమ్మనీరు తాగిందని.. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, లేదంటే తల్లీబిడ్డలకు ప్రమాదమని చెప్పి గర్భిణుల బంధువులను భయపెట్టేస్తున్నారు. వైద్యులు చెప్పినట్లు చేయకపోతే తల్లీబిడ్డకు ఏమవుతుందోనన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. నార్మల్ డెలివరీ చేస్తే తకువ ఫీజు వస్తుందని, సిజేరియన్ అయితే ఎకువ సొమ్ము వసూలు చేయొచ్చని కొందరు వైద్యులు ఆపరేషన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మే 29న వికారాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ పాల్వన్‌కుమార్, ఎంసీహెచ్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సా యిబాబా, డిప్యూటీ మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు జిల్లా కేంద్రంలోని గాయత్రి నర్సింగ్ హోమ్‌ను తనిఖీ చేయగా.. అక్కడ జరిగిన ప్రసవాల్లో అధికంగా సీ-సెక్షన్ కేసులు (సిజేరియన్లు) ఉన్నట్లు వారి దృష్టికి వచ్చింది. రోగుల కేస్ షీట్స్ కూడా అసం పూర్తిగా ఎంట్రీ చేసినట్లు గుర్తించి.. అసలేం జరుగుతున్నది. ఎక్కువగా సీ సెక్షన్లు ఎందుకు జరుగుతున్నాయని నిర్వాహకులకు జిల్లా వైద్యాధికారులు నోటీసులు జారీ చేశా రు. గైనకాలజిస్టులు సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు జరిగేలా చొరవ తీసుకోవాలని.. సిజేరియన్ ప్రసవాలను ప్రోత్సహించొద్దని సూచించారు. పేషెంట్ కేస్ షీట్లో పూర్వ, ప్రస్తుత గర్భస్థ చరిత్ర, అలాగే ఆపరేషన్ థియేటర్ నోట్స్, చికిత్స, డిశ్చార్జి సమ్మరీ కచ్చితంగా నమో దు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన గైనకాలజిస్ట్, ఆసుపత్రి యజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.