
వికారాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : కరోనాతో గతంలో సర్వసభ్యసమావేశం నిర్వహించుకోలేకపోయాం.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ వస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని, వాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా చూడాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్‌రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించడానికి సమావేశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహేశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, సీఈవో జానకిరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం సజావుగా సాగింది.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. గతేడాది జిల్లా పరిషత్ నుంచి కరోనా నివారణకు జిల్లాలో అనేక చర్యలు తీసుకున్నాం. దీనిపై ప్రభుత్వం ప్రశంసించిందని గుర్తు చేశారు. ఇక ముందు కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా జడ్పీ నుంచి బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. రైతులు పంటను ఇంటి నుంచి తీసుకురావడానికి జడ్పీ నుంచి పానాది రోడ్లు వేయిస్తున్నామన్నారు. దీంతో రైతుల భూములకు మార్కెట్లో విలువ పెరిగిందన్నారు. రైతు బంధు అందరికి వచ్చిందా లేదా ఆరా తీయాలన్నారు. పాసుపుస్తకాలు పెండింగ్‌లో లేకుండా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలో మంజూరైన బ్రిడ్జీల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని.. ధ్వంసమైన ఆర్అండ్బీ, పంచాయతీ రోడ్లకు మరమ్మతులు చేయాలని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ దవాఖానకు రూ.60లక్షలు ఖర్చు
వైద్య ఆరోగ్య శాఖ దవాఖానకు జడ్పీ నుంచి రూ.60లక్షల నిధులను ఖర్చు చేశామని సునీతారెడ్డి తెలిపారు. వైద్యులకు కిట్లు కూడా అందజేశామన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడానికి పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీరు దుర్వినియోగం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పాఠశాలల మరమ్మతులు, కొత్త తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని.. పనులు వెంటనే పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలన్నారు. నాణ్యత లోపిస్తే ఇంజినీర్లపై చర్యలు తప్పవన్నారు. మంజూరు కాని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీలులేదన్నారు.
ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద చేపట్టిన శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలన్నారు. నాటిన మొక్కలకు నీళ్లు పోస్త్తూ సంరక్షించాలని, గ్రామాల్లో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలను గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. లబ్ధిదారులకు రుణాలు అందించి స్వయం ఉపాధి పొందేలా చూడాలన్నారు. పేదలకు సకాలంలో రేషన్ సరుకులు అందించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రెవెన్యూ వారు నిఘా పెట్టాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, అడవుల్లో వన్యప్రాణులకు పండ్ల చెట్లు నాటాలన్నారు. అనంతగిరి అడవుల్లో వందల రకాల పక్షులు ఉన్నాయని, వాటిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.
జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక భూమిక
జిల్లాలో కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్న గ్రామాలను గుర్తించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు ప్రోత్సాహం కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చూడాలని ఆదేశించారు. పింఛన్ల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు సహకరించాలన్నారు. జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక భూమిక పోషిస్తుందని, జడ్పీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పొలాలకు పానాదులు, నీటి సమస్య ఉన్న చోట బోర్లు వేయించడం, డ్వాక్రా, అంగన్వాడీ భవనాలు నిర్మించడం వంటి పనులు చేశామని వివరించారు. మరిన్ని పనులు చేపడుతూనే జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
పలు అంశాలపై చర్చ
వ్యవసాయ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, రహదారులు, భవనాలు తదితర శాఖలకు సంబంధించి చర్చ జరిగింది. సంబంధిత అధికారులు సభ్యులు అడిగిన ప్రశ్నాలకు సమాధానాలు చెప్పారు. సభ్యులు వివరించిన సమస్యలను అధికారులు నోట్ చేసుకున్నారు. జఠిలంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు వెల్లడించారు. మర్పల్లి మండలం ఘనాపూర్ గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను మండల జడ్పీటీసీ సభ్యుడు ప్రశ్నించగా.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈ అంశంపై కలెక్టర్ సమాధానం ఇవ్వాలన్నారు. ఘనాపూర్ భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌లో ప్రొహిబిటెడ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. బొంరాస్‌పేట ఎంపీడీవో పవన్‌కుమార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీ సభ్యురాలు సభ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై ఆలోచించి చర్యలు తీసుకుంటామని జడ్పీటీసీకి హామీ ఇచ్చారు. తాండూరు-తొర్మామిడి, తాండూరు-జిన్గుర్తి-తట్టెపల్లి, పెద్దేముల్ మండలంలోని బుద్దారం, గాజీపూర్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాలు, ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని జడ్పీటీసీ సభ్యుడు ధారాసింగ్ జిల్లా రహదారులు అండ్ భవనాల శాఖ అధికారి లాల్సింగ్ను నిలదీశారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లతో పాటు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ఎంత నష్టం వాటిల్లిందో తెలుపాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ను ప్రశ్నించగా.. మక్కజొన్న, పెసర, మినుములు కొంత దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీల పరిధిలో భూసార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని ధారాసింగ్ కోరగా.. చర్యలకు శ్రీకారం చుడుతామని సంబంధిత అధికారి వెల్లడించారు. అతివృష్టి, అనావృష్టితో దెబ్బతిన్న పంటలను అంచనా వేశారా.. పంటల వారీగా సాగు వివరాలు ఏమిటని ఎమ్మెల్యే యాదయ్య డీఏవోను ప్రశ్నించారు. రానున్న పంట దిగుబడి లోపు రైతు వారీగా పంటల వివరాలను సేకరించాలని దోమ జడ్పీటీసీ సభ్యుడు నాగిరెడ్డి సూచించారు. ప్రభుత్వం చిరు ధాన్యాలపై దృష్టి పెట్టిందని.. ఆ దిశగా జిల్లాలో ఎలాంటి చర్యలు చేపట్టారని జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ ప్రశ్నించారు. డీఎంఎఫ్టీ నుంచి స్కూళ్లు, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులకు సంబంధించి నిధులు కేటాయించాలని సభ్యులు కోరారు.
జిల్లాలో రూ.7.52 కోట్ల ట్యాక్స్ లక్ష్యం కాగా.. రూ.6.11 కోట్ల ట్యాక్స్ వసూలైందని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా సభలో వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు, ట్యాంకర్ల రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్యేలు యాదయ్య, మహేశ్‌రెడ్డి ప్రశ్నించారు. తక్షణమే ట్రాక్టర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమిబసుకు సూచించారు. జిల్లా పర్యావరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ కలెక్టర్‌ను కోరారు. ఎర్రమట్టి తవ్వకాలు, ఇతరత్రా తవ్వకాలు నిలిపేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండేండ్లుగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి శాఖల వారీగా వివరాలు అందజేయాలని జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.