వికారాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆమోదించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో పాఠశాలల పునఃప్రారంభం, పారిశుధ్య పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ… కొవిడ్ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తరువాత సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గదిని, టాయిలెట్లు, కిచెన్ షెడ్లను శుభ్రపరచాలన్నారు. ప్రతి పాఠశాలకు తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులపై జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ఆగస్టు 30 లోగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించాలన్నారు. ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కొవిడ్ లక్షణాలతో బాధపడితే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ… పాఠశాల ఆవరణల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని, నిల్వ నీరు లేకుండా మట్టి వేయించాలన్నారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుంచి డొనేషన్లు స్వీకరించి పాఠశాలల్లో వైట్ వాషింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని వివరించారు. తాత్కాలిక మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలన్నారు. అన్ని పాఠశాలల్లో బ్లీచింగ్, లైమ్ చల్లించాలని, తాగునీటి వాటర్ ట్యాంకులను క్లోరినేట్ చేయించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావు, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, డీపీవో రిజ్వానా, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్ పాల్గొన్నారు.