
వికారాబాద్, జూలై 24, (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎంపీ సంతోష్‌కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారని పలువురు కీర్తించారు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గుండ్లపల్లి, అల్లాపూర్ గ్రామంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆయా గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులకు డిక్షనరీలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొడంగల్ నియోజకవర్గం నుంచి మంత్రి సబితారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు డిక్షనరీలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం పంపిణీ చేయగా.. ఇతర స్కూళ్ల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అందజేయనున్నారు.
ఒక్కరోజే నాటిన 5లక్షల మొక్కలు
జిల్లాలో ఒక్క రోజే 5లక్షల మొక్కలు నాటారు. పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలోని 25 హెక్టార్లలో 29 వేలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలో 17వేలు, తాండూర్ నియోజకవర్గంలో 28వేల మొక్కలు, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో లక్ష మొక్కలు నాటారు. 566 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గుండ్లపల్లి,అల్లాపూర్ అటవీ ప్రాంతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మొక్కలు నాటి, కేక్ చేశారు. అర్బన్ ఫారెస్టులో కేటీఆర్ అక్షరాల ఆకారంలో మొక్కలు నాటించారు. యాలాల మండలం బషీర్మియా తండాలో కేటీఆర్ జన్మదిన వేడకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు. తాండూరులోని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో మొక్కలు నాటి, కేక్ కట్ చేశారు. పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 29వేల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కులకచర్లలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిపి డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. వికారాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అలంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కోట్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. జిల్లా కేంద్రకంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పౌసుమి బసు, కొడంగల్‌లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు.