షాబాద్, జనవరి 27: జీవాల ఆరోగ్యంపై కాపరులు జాగ్రత్తలు పాటించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండల పరిధిలోని కొమరబండ, చందనవెళ్లి గ్రామాల్లో సిబ్బందితో కలిసి గొర్రెలు, మేకలకు పారుడు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గొర్రెలు, మేకలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల కాపరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీను, విజయ్, బలరాం పాల్గొన్నారు.
జీవాల సంరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యం
మొయినాబాద్, జనవరి 27 : జీవాల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మండల అధికారి శ్రీలత తెలిపారు. గురువారం మండల పరిధిలోని అజీజ్నగర్, సురంగల్ గ్రామాల్లో 900 జీవవాలకు పారుడు రోగం నివారణ టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవాల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మేకలు, గొర్రెలకు పారుడు రోగం రావడంతో మూతికి పుండ్లు కావడం, కళ్ల నుంచి నీళ్లు కారడం, మేత తినడానికిరాకపోవడంతో పాటు జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. వ్యాధి నివారణ కోసం వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలని తెలిపారు.
498 జీవాలకు టీకాలు
కొత్తూరు రూరల్, జనవరి 27: మండలంలోని వివిధ గ్రామాల్లో 498 జీవాలకు పీపీఆర్ వ్యాక్సిన్ను ఇచ్చినట్లు మండల పశువైద్యాధికారి స్ఫూర్తి తెలిపారు. మక్తగూడ, మల్లాపూర్తండా, మల్లాపూర్ గ్రామాల్లో మొత్తం 306గొర్రెలు, 192మేకలకు పుర్రు రోగం నివారణ టీకాలను వేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని శేనిగూడబద్రాయపల్లి గ్రామంలో జీవాలకు టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది మల్లయ్య, రవి, కృష్ణ, గొర్రె కాపురులు పాల్గొన్నారు.