బొంరాస్పేట, డిసెంబర్ 19 : వ్యవసాయంలో మిగతా పంటలతో పోలిస్తే వామును తక్కువ శ్రమతో పండించవచ్చు. ఎటువంటి నేలలోనైనా ఎటువంటి వాతావరణంలోనైనా వాము పంటను సాగు చేయవచ్చు. వర్షాధారం అయితే నల్లరేగడి నేలలు, నీటి పారుదల వసతి ఉంటే తేలికపాటి నేలలు ఈ పంటను సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. మంచుతో కూడిన వాతావరణం అయితే చాలా అనుకూలమని చెప్పవచ్చు. అందుకే వాము పంట సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వాముకు మార్కెట్లో కూడా మంచి ధర ఉండడంతో రైతులు దీనిని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో వాము పంటను రైతులు సాగు చేస్తున్నారు. బొంరాస్పేట మండలంలోని రేగడిమైలారంలో 50 ఎకరాల్లో రైతులు వాము పంటను సాగు చేస్తున్నారు. ఆగస్టులో పొలంలో విత్తనాలు చల్లితే ఐదు నెలల్లో పంట చేతికి వస్తుంది. విత్తనం నాటిన రెండు నెలలకు ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. ఎరువులు, మందుల పిచికారీ తదితర ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. పంట కోత సమయంలోనే కూలీల ఖర్చు భరించాల్సి ఉంటుంది.
మార్కెట్లో మంచి డిమాండ్
వాముకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాలుకు రూ.18వేల నుంచి రూ.19వేల వరకు ధర పలుకుతుంది. ఇక్కడ పండించిన వామును వికారాబాద్, పరిగి మార్కెట్లకు తరలించి అమ్ముకుంటారు. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. పొలం తీరును బట్టి వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది.
22 క్వింటాళ్లు దిగుబడి
వాము పంట సాగు చేసిన 160 రోజులలో చేతికి వస్తుంది. పంటలో రెండుసార్లు కలుపు తీయాల్సి వస్తుంది. మందులు కూడా పిచికారీ చేశాను. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. నేను 10 ఎకరాల్లో సాగు చేస్తే 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వర్షాల వల్ల పంట దిగుబడి కొంత తగ్గింది. క్వింటాలుకు రూ.16 వేల ధర వచ్చింది.
-రాచప్ప, రేగడిమైలారం