వికారాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి దిశానిర్దేశంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, కొడంగల్, పరిగి, తాండూరు మాజీ ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి.. శ్రేణులను సమయాత్తం చేయడంతోపాటు ప్రతి జడ్పీటీసీ స్థానంలోనూ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేలా కసరత్తు చేస్తున్నారు. అయితే, జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పార్టీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నది.
ఈ పదవిని వికారాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్‌గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, తాండూరు సెగ్మెం ట్ నుంచి గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, కొడంగల్ సెగ్మెంట్ నుంచి గతంలో మహబూబ్‌నగర్ జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన కృష్ణ ముదిరాజ్ ఆశిస్తూ.. రేసులో ఉన్నారు. కాగా, జిల్లా చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఇంట్లో రెండు రోజుల కిందట సమావేశమైన మాజీ ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
త్వరలోనే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో సమావేశమై జడ్పీ చైర్మన్ అభ్యర్థి విషయమై మాజీ ఎమ్మెల్యేలు చర్చించి, అనంతరం ఆశావహు ల పేర్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందజేయనున్నట్లు సమాచారం. అయితే ఆశావహుల్లో ఒకరిని జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతారా..? లేదా కొత్త వారిని బరిలోకి దింపుతారా అనేది త్వరలోనే తేలనున్నది. ఏదేమైనా ఈసారి కూడా జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది.
మరోవైపు, గత ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల స్థానాలు పెరిగాయి, గత ఎన్నికల్లో 18 జడ్పీటీసీ, 18 ఎంపీపీ, 221 ఎంపీటీసీ స్థానాలు, 565 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఈ దఫా 20 జడ్పీటీసీ స్థానాలకు, 20 ఎంపీపీలు, 227 ఎంపీటీసీలకు, 594 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 137 ఎంపీటీసీ స్థానాలను, 16 జడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలతోపాటు 355 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నది.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా వ్యూ హంతో ముందుకెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు మండలాల్లో సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ శ్రేణులను సన్నద్ధం చేశారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది.
అదేవిధంగా మండలాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా శ్రేణులకు మాజీ ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ప్రధానంగా రెండేండ్లలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నయా పైసా మంజూరు చేయకపోవడంతోపాటు స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రేణులను బీఆర్ఎస్ నాయకత్వం సమయాత్తం చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛతలో, అభివృద్ధిలో జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీలు ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారాయి.