పెద్దేముల్, జూలై 12 : వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లితండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో సుమారు 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్న భోజనంలో భాగంగా ఏజెన్సీవారు విద్యార్థులకు పులిహోరను వడ్డించారు.
అది తిన్న కాసేపటికి 18 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పి, వాంతులు చేసుకుంటుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం విద్యార్థులను తాండూరులోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం 14 మందికి విద్యార్థులు కోలుకోగా ఇంటికి పంపించారు. మరో నలుగురు విద్యార్థులను వైద్యులు అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు.
వారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. కాగా, జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని వారు కోరుతున్నారు.