వికారాబాద్, జూలై 19 : వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వసతి గృహాల్లో అధికారుల సందర్శన, గురుకుల పాఠశాలల్లో సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వన మహోత్సవం, నర్సరీల నిర్వహణ, సన్న బియ్యం అందుబాటు తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి వసతి గృహాలను సందర్శించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. గురుకుల పాఠశాలల నిర్వహణ, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురైన సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని బట్టి చెల్లించాల్సిన డబ్బును లబ్ధిదారులకు అందచేయాలని కలెక్టర్ తెలిపారు. వనమహోత్సంలో భాగంగా శాఖల వాటిగా ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఈత మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నర్సరీ నిర్వాహణలను సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, మండల ప్రత్యేక అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.