వికారాబాద్, ఆగస్టు 31 : జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శనివారం ఎస్పీతో కలిసి కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులంతా అప్రమత్తం గా ఉండాలన్నారు.
రానున్న రెండు, మూడు రోజులు సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ సూచించిందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పాతబడిన మిద్దెలు ఉండి శిథిలావస్థకు చేరుకొని ఉంటే అలాంటి వాటిని గుర్తించి వెంటనే అందులో నుంచి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మురుగు కాల్వలను శుభ్రం చేయించాలన్నారు.
మురుగు కాల్వలు నిండి ఓవర్ ఫ్లో కాకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కడైనా పంట నష్టం జరిగితే వెంటనే నివేదిక సిద్ధం చేసి పంపించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. విద్యుత్తు సమస్య లేకుండా చూసుకోవాలని, పాతబడి కుంగిపోయిన విద్యుత్తు స్తంభాలు ఉంటే వెంటనే మార్చాలని, వైర్లు కిందికి వేలాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు.
ఎక్కడైనా ఏమైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.