వికారాబాద్, నవంబర్ 22: అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, పాఠశాల తనిఖీలు తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పథకాలను అమలు పరచాలన్నారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించే క్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిష్కరించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలలో కచ్చితంగా సన్న బియ్యాన్ని సరఫరా చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారానికి 3 సమయాల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. నీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భవనాల్లో మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైద్య అధికారులు, సిబ్బంది పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రేణుకా దేవి, సీపీవో అశోక్, వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.