ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చడంతోపాటు ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించే దిశగా వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలను ముమ్మరం చేశారు. అందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా జియో అటెండెన్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ విధానం అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు జియో అటెండెన్స్ అమలవుతుండగా, మరో వారం రోజుల్లో డివిజినల్ స్థాయి, కలెక్టరేట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ అటెండెన్స్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ట్రెజరీ ద్వారా జీతాలను చెల్లించనున్నారు. కలెక్టరేట్ ఉద్యోగులకు ప్రత్యేక యాక్సెస్ కార్డులను అందజేసి బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు యాక్సెస్ కార్డులతో స్వైప్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా, త్వరలో స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితనంలో మార్పులు తీసుకువచ్చేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సరిగ్గా పనిచేయనట్లయితే ప్రజలకు నష్టం జరగడంతోపాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకుగాను జియో అటెండెన్స్ యాప్‌ను జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామ, మండల, డివిజినల్ స్థాయిల్లో ఓ విధానం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే గ్రామ, మండలస్థాయిల్లోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు జియో అటెండెన్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వారం రోజుల్లోగా డివిజినల్స్థాయి ఉద్యోగులతోపాటు జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అటెండెన్స్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీద్వారా జీతాలను చెల్లించనున్నారు.
జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సోమవారం నుంచి జియో అటెండెన్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.వైద్యులతోపాటు ఇతర సిబ్బంది ఉదయం, సాయంత్రం ఫొటోలను జియో అటెండెన్స్ యాప్‌లో పొందుపరుస్తున్నారు. యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై జిల్లా ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొంతమంది వైద్యులు సమయానికి రాకుండానే వచ్చినట్లుగా, నిర్ణీత సమయం కాకుండానే వెళ్లడం వంటి వాటితో ప్రజలకు వైద్యం అందుబాటులో లేకపోయింది. కలెక్టర్ నారాయణరెడ్డి శ్రీకారం చుట్టిన కొత్త సంస్కరణలతో జిల్లా ప్రజానీకానికి సత్వర వైద్యం అందనుంది.
జిల్లాలోని గ్రామ, మండలస్థాయిల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ విధానాన్ని త్వరలో జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ తదితర శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారం రోజుల్లోగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ఒక్కో ఉద్యోగికి ప్రత్యేకంగా యాక్సెస్ కార్డులను అందజేయనున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు యాక్సెస్ కార్డులతో స్వైప్ చేయాల్సి ఉంటుంది. మంగళవారం నుంచి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిల్లోని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానానికి సంబంధించి జియో అటెండెన్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఉద్యోగి ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా ఫొటో తీసి జియో అటెండెన్స్ యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జియో-అటెండెన్స్ యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేయనట్లయితే సంబంధిత ఉద్యోగి గైర్హాజరయినట్లుగా గుర్తిస్తారు. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ జియో-అటెండెన్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. అటెండెన్స్ ఆధారంగానే ఉపాధ్యాయులకు జీతాలను చెల్లించనున్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులందరికీ వారం రోజుల్లోగా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాం. కలెక్టరేట్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా యాక్సెస్ కార్డులను జారీ చేయనున్నాం. త్వరలో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తాం. ఇప్పటికే గ్రామ, మండల స్థాయిల్లోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు జియో-అటెండెన్స్ యాప్ ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం.