పరిగి : ఎలాంటి సమస్యలు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం వికారాబాద్‌లోని స్త్రీశక్తి భవన్లో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ఐదు ఎక్సైజ్ స్టేషన్ల వారిగా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ దరఖాస్తుదారులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలు, బ్యాంకర్లు డీడీలు జారీ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ఎలాంటి ఇబ్బందులు లేవని వారు తెలిపారు. జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ కింద కేటాయించిన 9మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. గురువారం సాయంత్రం 5గంటలతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తున్నందున ఎలాంటి సమస్యలు లేకుండా దరఖాస్తులు స్వీకరణ చేపట్టాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు సూచించారు.
ఈనెల 20వ తేదీ శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఉదయం 11గంటలకు డ్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, ఎక్సైజ్ సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.