తాండూరు రూరల్, సెప్టెంబరు 22 : జోరు వానలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు మండల పరిధిలోని నారాయణపూర్, చిట్టిఘనాపూర్ సమీపంలోని కాగ్నా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గౌతాపూర్ సమీపంలోని పాలిషింగ్ మిషన్లు, రిలయన్స్ పెట్రోల్ బంకు నీట మునిగాయి.
జుంటి వాగుకు వరద ఉధృతి
బషీరాబాద్, సెప్టెంబర్ 22 : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జుంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బషీరాబాద్-తాండూర్ రోడ్డు మార్గంలో గోనూరు- కాశీంపూర్ గ్రామాల మధ్య బుధవారం ఉధృతంగా ప్రహిస్తూ కనిపించింది. రోడ్డు మార్గం గుండావెళ్లే ప్రయాణికులు వాగు ప్రవాహాన్ని చూస్తూ ఆనందించారు.
నిండు కుండలా దౌల్తాబాద్ పెద్ద చెరువు
దౌల్తాబాద్, సెప్టెంబర్ 22 : కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలోని పెద్ద చెరువు నిండుకుండలా మారింది. బుధవారం తెల్లవారు జామునుంచి దౌల్తాబాద్ పెద్ద చెరువుకు వరద పోటెత్తింది. సమీప గ్రామాల్లోని బోరు బావుల్లో నీటి మట్టం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లాలో పలుచోట్ల వర్షం
పరిగి, సెప్టెంబర్ 22 : వికారాబాద్ జిల్లా పరిధిలో అక్కడక్కడ చిన్నపాటి వర్షం కురిసింది. మంగళవారం కురిసిన వర్షంతో జిల్లా పరిధిలోని మర్పల్లిలో 22.2 మి.మీ, మోమిన్‌పేట్‌లో 3.6, నవాబుపేట్‌లో 13.2, వికారాబాద్‌లో 10.4, పూడూరులో 39.0, పరిగిలో 5.4, కులకచర్లలో 27.4, దోమలో 8.0, ధారూర్‌లో 3.8, బంట్వారంలో 5.2 , తాండూరులో 15.6, యాలాల్లో 12.2, పెద్దేముల్లో 5.4, బషీరాబాద్‌లో 42.0, బొంరాస్‌పేట్‌లో 3.4, కొడంగల్‌లో 30.4, దౌల్తాబాద్‌లో 18.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.