మంచాల సెప్టెంబర్7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకంతో గిరిపుత్రుల తాగునీటి కష్టాలు శాశ్వతంగా తప్పాయి. ఒకప్పుడు తండాలోని మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీసేవారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ మారుమూల తండాల్లో కూడా స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి స్థాయిలో తండాల్లో, గ్రామాల్లో పూర్తి చేసి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చారు. మంచాల మండలంలోని కొర్రవాని తండా, పటేల్చెర్వుతండా,ఆంబోతుతండా, సత్తితండా,బుగ్గతండా, సలిగుట్టతండా,గుట్టకింది తండా,ముచ్చర్ల కుంటతండాల్లోని గిరిజనులు గతంలో ఏండ్లుగా తాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డారు. కానీ నేడు తండాలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన మిషన్‌భగీరథ నీటిని అధికారులు సరఫరా చేస్తుండడంతో గిరిజన మహిళలు తాగునీటి కష్టాలు పూర్తిగా తొలిగిపోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీల ఏర్పాటుతో మారిన రూపురేఖలు
500జనాభా గల తండాలను సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతో తండాల రూపురేఖలు మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మంచాల మండలంలో నాలుగు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. తండాల అభివృద్ధి కోసం జనాభా ప్రాతిపదికన ప్రతి నెల పంచాయతీ ఖాతాలో డబ్బులను జమ చేయడంతో పాటు పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా తండాలోని సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతున్నాయి.
తండాలకు ప్రతి రోజు లక్షలీటర్ల తాగునీరు
మంచాల మండలంలో పలు గిరిజన తండాలకు ప్రతి రోజూ లక్షల లీటర్ల మిషన్ భగీరథ తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన తండాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు.
తండాల్లో భగీరథ తాగునీరు నిత్యం ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు సరఫరా అవుతున్నది. ప్రతి తండాల్లో ఐహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, సంపు నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా తండాల్లో ప్రత్యేక పైపులైన్ వేసి, ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు.
సరిపడా నీళ్లొస్తున్నయ్
ఉదయమే మిషన్ భగీరథ నీరు మా ఇంటి అవసరాలకు సరిపడా వస్తున్నయ్ …తండా అంతటా పైపులైన్లు వేసి, ఇం టింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. -మెగావత్ మోతీ
తండాలకు మంచి రోజులొచ్చినయ్
తండాలకు మంచి రోజులొచ్చినయ్. తాగునీటి కోసం గతంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేది.ఒకపూటంతా పనిమాని నీళ్లు తెచ్చుకునేది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని పుష్కలంగా మిషన్ భగీరథ నీళ్లొస్తున్నాయి. ఎన్నో ఏండ్ల తాగునీటి కష్టాలు తీరాయి.
–మెగావత్పీరీ
సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు
మిషన్ భగీరథతో తండాల్లో నీటి కష్టాలు తీరాయి. ఇదివరకు నానా ఇబ్బందులు పడేటోళ్లం. ఇప్పుడు పొద్దుగాళ్లనే నీళ్లొస్తున్నయ్. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చాం. గతంలో కొండల్లో ని దోనలు, చెలిమెల్లో నీరు తాగేవారు. మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీరాయి.సీఎం కేసీఆర్ పుణ్యంతో తండాల్లోని తాగు నీరు, పారిశుధ్య సమస్యలు పరిష్కారం అయ్యాయి. సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
-లక్ష్మి(కొర్రవాని తండా సర్పంచ్)