
పరిగి, అక్టోబర్ 5 : ప్రతి గ్రామపంచాయతీలో రోజుకు కనీసం 30 మందికి తగ్గకుండా ఉపాధి హామీ కూలీలతో అభివృద్ధి పనులు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఎఫ్‌టీవో అప్లోడ్ చేసి చెల్లించే ఏర్పాట్లు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లను కలెక్టర్ హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నవాబుపేట మండలం మదన్‌పల్లి గ్రామ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఓలు, గ్రామ కార్యదర్శులతో గ్రామంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి పారిశుధ్యం, పరిశుభ్రత పనులు చేయించాలన్నారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డు, ఉపాధి హామీ కూలీలు చేపట్టిన పనులను పరిశీలించాలన్నారు. కూలీలను ఒకరోజు ముందే సమావేశపరిచి మరుసటి రోజు చేయాల్సిన పనులు తెలియజేయాలని చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో కూర్చొని పెండింగ్ పనులను, నిర్వహించాల్సిన రిజిస్టర్లు పూర్తిచేసి ఉంచాలన్నారు. వచ్చే సంవత్సరం లక్ష్యం మేరకు హరితహారం కోసం అవసరమైన మొక్కలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్క బ్యాగ్ కూడా ఖాళీగా కనిపించరాదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
నర్సరీల్లో మిగిలిన మొక్కలను వెంటనే నాటాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు నర్సరీల్లో పనిచేసే వాచర్లకు సంబంధించిన చెల్లింపులు ఎప్పటికప్పుడు జరుగాలని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాల పనుల్లో పురోగతి కన్పించాలని, బోర్డులు, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినపుడు పనుల్లో తేడాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అన్ని గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాల పనులు వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన చెల్లింపులకు ఎఫ్‌టీవోలు అప్లోడ్ చేయాలన్నారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠధామాలకు సంబంధించిన సర్పంచ్ల డబ్బులు, ఉపాధిహామీ కూలీలు, నర్సరీల్లో పనిచేసే వాచర్ల డబ్బులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులున్నారు.