పరిగి,అక్టోబర్ 4: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత అనేక రకాలుగా మానవుడికి ఉపయోగపడుతున్నది.ఇటీవల డ్రోన్లతో అత్యవసర సమయా ల్లో టీకాలు, మందులు తరలించే కార్యక్రమానికి వికారాబాద్ వేదికగా నిలువగా ఈసారి అటవీ శాఖ అధికారులు డ్రోన్‌తో అడవిలో వివిధ రకాల మొక్కలకు సంబంధించిన సీడ్‌బాల్స్ వెదజల్లారు. పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకానికి సంబంధించి మొక్కలు నాటేందుకు అనువుగా లేదు. గుట్టల ప్రాంతం ఉండడంతో గుంతలు తవ్వడానికి ఇబ్బందికరం. దీంతో సోమవారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హాయ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుమన్, బీట్ ఆఫీసర్ మల్లప్పతోపాటు హైదరాబాద్‌లోని పీసీసీఎఫ్ కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది నస్కల్ అటవీ ప్రాంతంలో డ్రోన్‌తో వివిధ రకాల మొక్కలకు సంబంధించిన సీడ్‌బాల్స్ వెదజల్లారు. అడవిలో పెరిగే సీతాఫలాలు, చింత, గోరింటాకు, ఉసిరి, వెదురుకు సంబంధించిన విత్తనాల బాల్స్ డ్రోన్ ద్వారా అటవీ ప్రాం తంలో వెదజల్లారు. ఒక్కోసారి 3వేల విత్తనాల బాల్స్ చొప్పున, పది పర్యాయాలు మొత్తం 30వేల సీడ్‌బాల్స్ నస్కల్ అటవీ ప్రాంతంలో వెదజల్లారు. గతంలో సీడ్‌బాల్స్‌ను అటవీ ప్రాంతంలో స్వయంగా విసిరివేసేవారు. డ్రోన్‌తో సీడ్‌బాల్స్ వెదజల్లడం వికారాబాద్ జిల్లాలో ఇదే మొదటిసారి.