సకల సౌకర్యాలు.. నాణ్యమైన సేవలతో వికారాబాద్‌లోని డయాగ్నస్టిక్ సెంటర్ దేశంలోనే మొదటిస్థానం సాధించింది. ‘జిల్లా దవాఖానల పనితీరులో ఉత్తమ విధానాలు’ పేరిట భారత కుటుంబ సంక్షేమశాఖ, నీతి ఆయోగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన ఫలితాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. చిన్న దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరించడం, పరీక్షలు జరిపి తక్కువ సమయంలోనే కచ్ఛితమైన ఫలితాలను అందించడంపై కితాబునిచ్చింది. మరోవైపు ఈ డయాగ్నస్టిక్ సెంటర్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రూ.3.50కోట్లతో జూన్ 9వ తేదీన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కేవలం 113 రోజుల వ్యవధిలో 13,262 వైద్య పరీక్షలు నిర్వహించారు. అందుకోసం 5,370 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. అంతేకాకుండా 24 గంటలలోపే రోగుల సెల్ నెంబర్లకు వైద్య పరీక్షల ఫలితాలు పంపిస్తూ ఇక్కడి సిబ్బంది ప్రజల మన్ననలు పొందుతున్నారు. మూడు జిల్లాల్లోని 32 దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా.. రోజుకు సుమారుగా 300లకు పైగా టెస్టులు చేస్తున్నారు.
పరిగి, అక్టోబర్ 1 : పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్న వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు జాతీయ స్థాయిలో నెం 1 స్థానం దక్కింది. రెండు కేటగిరీలలో డయాగ్నస్టిక్ సెంటర్లను ఎంపిక చేయగా, తక్కువ పడకలు గల చిన్న దవాఖానల నుంచి రక్త నమూనాలను సేకరించి వెంటనే ఫలితాలను తెలియజేయడం వల్ల దేశంలోనే నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైద్య విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నీతి ఆయోగ్ కితాబునివ్వడం గమనార్హం. డయాగ్నస్టిక్ సెంటర్ల వల్ల రాష్ర్టానికి గొప్ప పేరు వస్తున్నది. భారత కుటుంబ సంక్షేమ శాఖ, నీతి ఆయోగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యాయన ఫలితాలను నీతి ఆయోగ్ విడుదల చేయగా, వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ టాప్‌లో నిలిచింది. రూ.3.50కోట్లతో వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను జూన్ 9న విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. 113 రోజుల వ్యవధిలో 13,262 వైద్య పరీక్షలు చేశారు. తద్వారా 5,370 మంది రోగులకు పరీక్షలు చేసి ఫలితాలను తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక యంత్ర పరికరాలతో అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
113 రోజులు.. 13,262 టెస్టులు..
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభమైన మరుసటి రోజు నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు ప్రారంభించారు. దవాఖానలో ప్రోగ్రామ్ ఆఫీసర్, ల్యాబ్ మేనేజర్, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ పని చేస్తున్నారు. 113 రోజుల్లో 5,370 మంది రోగుల నుంచి 9,341 శాంపిల్స్ సేకరించి 13,262 టెస్టులు చేశారు. నెలల వారీగా పరిశీలిస్తే జూన్ 10 నుంచి 30వ తేదీ వరకు 1,046 మంది నుంచి 1,918 శాంపిల్స్ సేకరించి 2,562 టెస్టులు, జూలైలో 1,275 మంది నుంచి 2,329 శాంపిల్స్ సేకరించి 3,567 టెస్టులు, ఆగస్టులో 1,634 మంది నుంచి 2,904 శాంపిల్స్ సేకరించి 4,284 టెస్టులు, సెప్టెంబర్‌లో 1,365 మంది నుంచి 2,103 శాంపిల్స్ సేకరించి 2,742 టెస్టులు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన 13,262 వైద్య పరీక్షలకు సంబంధించి రూ.కోటి 50లక్షల నుంచి రూ.2కోట్ల వరకు విలువ చేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
24 గంటల్లో టెస్టుల ఫలితాలు..
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఎల్డీహెచ్, డీ డైమర్, హెచ్‌బీఏ1సీ వంటి సేవలు సైతం అందుతున్నాయి. డయాగ్నస్టిక్ సెంటర్‌కు శాంపిల్స్ చేరుకున్న 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడిస్తారు. సంబంధిత రోగి ఫోన్ నెంబర్‌కు రిపోర్టును పంపిస్తారు. నిత్యం సుమారు 300 పైచిలుకు టెస్టులు చేస్తున్నారు. సోమవారం, శుక్రవారం ఏఎన్సీ పరీక్షల కోసం గర్భిణులు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తారు. తద్వారా ఈ రెండు రోజుల్లో 500 పైచిలుకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉచితంగా, తక్కువ సమయంలో సేవలందుతుండడంతో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో టెస్టులకు అధిక ఖర్చు అవుతుందన్నది వాస్తవం. దీంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో డయాగ్నస్టిక్ సెంటర్లు నెలకొల్పగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
32 దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరణ..
వికారాబాద్ జిల్లా పరిధిలోని 22 పీహెచ్‌సీల నుంచి రక్త నమూనాలు సేకరించి ఆర్బీఎస్కే వాహనాల్లో వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు తీసుకొస్తున్నారు. జిల్లాలోని చిట్యాల్, కులకచర్ల, దోమ, పూడూరు, చన్గోముల్, మోమిన్‌పేట్, సిద్దులూరు, రామయ్యగూడ, నవాబుపేట్, మర్పల్లి, పెద్దేముల్, నాగసముద్రం, కోట్‌పల్లి, ధారూర్, బంట్వారం, బషీరాబాద్, బొంరాస్‌పేట్, కొడంగల్, దౌల్తాబాద్, అంగడిరాయచూర్, యాలాల్, నవాల్గ, జిన్గుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఆలూరు, చందన్వెల్లి, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, కొందుర్గు, టంగటూర్, సంగారెడ్డి జిల్లా మల్చెల్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు సేకరించి ఇక్కడికి పంపిస్తున్నారు.
రోజుకు 300 పైచిలుకు టెస్టులు..
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్లో నిత్యం 300 పైచిలుకు టెస్టులు నిర్వహిస్తున్నాం. ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు అధునాతన యంత్ర పరికరాలతో పరీక్షలు చేస్తున్నారు. సోమ, శుక్రవారాల్లో ఏఎన్సీ రోజులు కావడంతో ఈ రెండు రోజుల్లో 500 పైచిలుకు వైద్య పరీక్షలు చేస్తున్నాం.
జాతీయ స్థాయి గుర్తింపు రావడం హర్షణీయం..
వికారాబాద్ డయాగ్నస్టిక్ కేంద్రం అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం హర్షణీయం. మూడు జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నాం. 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం. కలెక్టర్, జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో సేవలు అందజేస్తున్నాం.
ఉచితంగా పరీక్షలు చేయడం సంతోషంగా ఉంది..
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్లో ఉచితంగా పరీక్షలు చేయడం సంతోషంగా ఉంది. గర్భిణుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పరీక్షల కోసం హైదరాబాద్ దూర ప్రాంతాలకు వెళ్లే బాధ, ఖర్చులు తప్పాయి.
నాణ్యమైన సేవలందిస్తున్నారు..
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ అధికారులు, సిబ్బంది సరైన శ్రద్ధ తీసుకుంటున్నారు. అత్యాధునిక పరికరాలతో పరీక్షలు చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేసి, ఫలితాలు తెలుపుతున్నారు. ప్రైవేటు దవాఖానల్లో అధిక డబ్బులు ఖర్చు చేయాల్సిన అవస్థలు తప్పాయి.