యాచారం, జూన్ 9 : దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అన్నారు. మండల కేంద్రంలోని విద్యాంగుల కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు దివ్యాంగులకు ఆసరా పింఛన్ రూ.4,000 నుంచి రూ.6,000లకు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం సిగ్గు చేటన్నారు. దివ్యాంగులపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పింఛన్‌ను రూ.6,000లకు పెంచి, సకాలంలో సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకే నెలలో రెండుమార్లు ఇచ్చిన పింఛన్ జూన్9 తారీఖు దాటినా పింఛన్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నాడే పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల మాదిరిగానే దివ్యాంగులకు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. దివ్యాంగులకు బ్యాంకుల ద్వారా తగిన రుణాలు అందించి స్వయం ఉపాధి పొందేలా చూడాలన్నారు. హామీలను నెరవేర్చకుంటే వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు బాలరాజు, మండల అధ్యక్షుడు మహ్మద్ సలీం, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి మూలి మహేశ్, నాయకులు జోగు అంజయ్య పాల్గొన్నారు.