కడ్తాల్, మార్చి 11 : మండల పరిధిలోని చరికొండ గ్రామంలో వెలసిన రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన్నట్లు ఆలయ ఈవో మోహన్రావు తెలిపారు. ఉత్సవాలను తిలకించేందుకు కందుకూరు, ఆమనగల్లు, యాచారం, ఇబ్రహీంపట్నం, మాడ్గుల్ మండలాల నుంచి భక్తులు తరలివస్తారు.
చరికొండ గ్రామంలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల వివరాలను ఆలయ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి వారికి అభిషేకం, రాత్రి స్వస్తివాచకం, ఋత్విగ్వరణం, అంకురార్పణం, 13న ధ్వజారోహణం, రాత్రికి భేరి పూజ, దేవతాహ్వానం, 14న మోహినీ సేవ, విష్ణుసహస్రనామం అర్చనలు, రాత్రి గరుడ సేవ, 15న స్వామి వారి కల్యాణం, రాత్రి రథోత్సవం, 16న స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చనలు, ఆంజనేయస్వామి అష్టోత్తర నామావళి, రాత్రి అశ్వవాహనంపై స్వామి వారి విగ్రహ ఊరేగింపు, లంకాదహనం, 17న పూర్ణాహుతి, చక్రతీర్థం, బండ్లపూజలు, రాత్రి పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, దేవతా విసర్జనం, శేషవాహనం, మూగబలి, పవళింపు సేవలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు వివరించారు.