వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే..వాటి ధర పైపైకి చేరుతున్నది. పెరిగిన నిత్యావసర, కూరగాయల ధరలు ప్రజానీకంపై మరింత భారాన్ని మోపుతున్నాయి. దీంతో సగటు కుటుంబం ఖర్చు రెండింతలు అయింది. భరించలేని స్థాయికి చేరడంతో ఇతర ఖర్చుల్లో కోత పెట్టుకోవడంతోపాటు పొదుపునూ తగ్గించాల్సి వస్తున్నది. అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలతో సగటు జీవి బతుకులు జిల్లాలో ఆగమాగం అవుతున్నాయి. మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
ఏ వంటకంలోనైనా నూనె తప్పనిసరి. అయితే ప్రస్తుతం నూనెలకూ ధరల సెగ తగిలింది. నాలుగు రోజుల కిందటి వరకు మార్కెట్లో రూ.1600 ఉన్న 15 లీటర్ల వంట నూనె డబ్బా ధర ప్రస్తుతం రూ.1800కి పెరిగింది. పూజకు ఉపయోగించే నూనె ధర సైతం నిన్నమొన్నటివరకు లీటర్ ప్యాకెట్ ధర రూ.100 ఉండగా నేడు రూ.120కి చేరింది. కందిపప్పు కిలో రూ.180, శనగపప్పు కిలో రూ.110, జిలుకర కిలో రూ.300గా ఉన్నది. ఇక వంటకాలకు ఘుమఘుమలను జోడించే మసాలాల ధరలు సైతం ఘాటెక్కాయి. జిల్లాలో మాంసాహార వినియోగం ఎక్కువే. అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డలతోపాటు మసాలా లేకుండా మాంసాహార వంటకాలు తయారు చేయడం కుదరదు.
శాకాహార వంటకాలకు మసాలా ఫ్లేవర్ ఉండాల్సిందే. అయితే రూ.300 వరకు ఉన్న వెల్లిల్లి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.420కి దొరుకుతున్నది. రూ.150 ఉన్న కిలో అల్లం ధర రూ.200లకు చేరింది. రూ. వంద కు నాలుగు కిలోలు వచ్చే ఉల్గిగడ్డ ప్రస్తుతం అమాంతం పెరిగిపోయి కిలోకు రూ.80 ధర పలుకుతున్నది. ఇలాచీలు కిలో మొన్నటివరకు రూ.వెయ్యి ఉండగా రూ.1200లకు ఎగబాకింది. దాల్చిన చెక్క ధర సైతం రూ.200ల నుంచి ఏకంగా రూ.350 కి పెరిగింది. సన్నబియ్యం ధర సైతం రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రస్తుతానికి క్వింటాలు బియ్యం బస్తా ధర రూ.6వేలకు పైనే ఉంది.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు కూరగాయల ధరలపై ప్రభావం చూపుతు న్నాయి. వర్షాలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. వేసవితో పోలిస్తే ప్రస్తుతం కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ..ఈ సీజన్లోనూ కూరగాయల ధరలు మండిపోతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. కూర గాయలు, ఆకు కూరలను కొనడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది.
సగటు మనిషి ఆదాయం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందాన ఉన్నప్పటికీ నిత్యావసరాలు, కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలపై పెరిగిన ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఒక పక్క ఇంటి అద్దెలు..మరోపక్క పిల్లల చదువులు..ఇంకోపక్క అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజానీకానికి పెరిగిన నిత్యావసర, భగ్గుమంటున్న కూరగాయల ధరలు శరాఘాతంలా మారాయి.
ఏడాది వ్యవధిలో నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 50 శాతం పెరిగితే..బియ్యం 13-25 శాతం వరకు పెరిగింది. నెల నెలా వచ్చే అరకొర జీతం తమ అవసరాలకు సరిపోక అప్పులపాలవుతున్న పరిస్థి తుల్లో కుటుంబ నెల బడ్జెట్ తలకిందులవుతున్నది. జీవనాన్ని సాగించడం పెద్ద యుద్ధ్దంగా మారిపోయిందని రంగారెడ్డి జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ధరల పర్యవేక్షణ కమిటీ ప్రతినెలా సమావేశం నిర్వ హించి ధరలు, విక్రయాలపై చర్చించాలి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే తగు చర్యలు తీసుకోవాలి. కానీ..ఇది పక్కాగా అమలుకావడం లేదు. దీంతో గత కొంతకాలంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.