బొంరాస్పేట, జూన్ 24 : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.ఏటా వానకాలంలో సహజంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు పెరిగిన ధరలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో ఏం కొనాలి ఏం తినాలని ్ర బెంబేలెత్తుతున్నారు. గతం వారం రోజుల కిందట కిలో టమాట రూ. 40లు ఉండగా ఆదివారం బొంరాస్పేట, తుంకిమెట్ల గ్రామా ల్లో జరిగిన వారాంతపు సంతల్లో రూ.100కు పెరిగింది. ప్రతి కూరలో వాడే టమాట ధర ఆకాశాన్నంటడంతో కిలో కొనేవారు అర కిలోతోనే సర్దుకుంటున్నారు.
టమాట ధర బాటలోనే మిగతా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పచ్చి మిరప కిలో రూ.100, వంకాయలు కిలో రూ. 80, బీర కాయలు రూ.100లు, చిక్కుడు రూ.80లు, ఆలుగడ్డ రూ.80లు, బెండకాయ, దొండకాయలు రూ.80, క్యారట్ రూ.80లు, క్యాప్సికం రూ.80లు, క్యాబేజీ రూ.80 వరకు పెరిగాయి. వీటితో పాటు ఆకు కూరల ధరలు బాగా పెరిగాయి. రూ.40లకు కిలో అమ్మే పాలకూర రూ.80లకు పెరిగింది. తోటకూర, ఇతరకూర ధర లు కూడా రూ.60కి పైగానే ఉన్నాయి.
కొత్తిమీర కిలో రూ. 200లు పలుకుతుంది. ధరలను చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయని, రూ.500లు తీసుకెళితే వారానికి సరిపడా కూరగాయలు కూడా రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కూరగాయల సాగు బాగా తగ్గడంతో పాటు సాగు చేసిన కూరగాయల పంటలు కొన్ని రోజుల కిం దట కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్నాయని, ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా చార్జీలు కలిపి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మున్ముందు వర్షాలు ఎక్కువగా కురిస్తే కూరగాయలు కొనే పరిస్థితి ఉండదేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.