మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొందామన్నా వామ్మో ఇంత రేటా.. అని కంగుతినాల్సి వస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో రోడ్ల వెంట ఉన్న కూరగాయల దుకాణాలు మొదలు.. ఏ మార్కెట్కు వెళ్లినా ధరలు దడ పుట్టిస్తున్నాయి.. ఇదివరకు రూ.300 ఖర్చు చేస్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి.. కానీ ప్రస్తుతం రూ.500 ఖర్చు చేసినా మూడు రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు.. ‘ఏమి కొనేటట్టులేదు.
ఏమి తినేటట్టు లేదు.. లచ్చులో లచ్చన్న.. ధరలిట్ట మండవట్టే లచ్చులో లచ్చన్న..’ అన్న సినిమా పాట సామాన్యులకు మళ్లీ గుర్తుకొస్తున్నది. మొన్నటి వరకు ఎండల తీవ్రత.. నేడు వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. కూరగాయల సాగు తగ్గి కొరత ఏర్పడడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కోడి గుడ్డు, చికెన్ ధరలతో వెజిటెబుల్స్ పోటీపడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.
– రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ)

నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా భగ్గు మంటున్నాయి. వారం, పది రోజులుగా ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రూ.60 ఉన్న కిలో టమాట ధర ఏకంగా రూ.90కి చేరింది. పచ్చిమిర్చి ధర రూ. 120కి పైగానే పలుకుతున్నది. వంద రూపాయలకు మూడు నాలుగు కిలోలు వచ్చే ఉల్లిగడ్డను ప్రస్తుతం రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఆకుకూరలను సై తం కొనే పరిస్థితి లేకుండా పోయింది.
మొన్నటివరకు రూ.20కి నాలుగు కట్టల వరకు ఇవ్వగా..ప్రస్తుతం రెండు కట్టలే ఇస్తున్నారు. కూరగాయల కొరతతో చాలా వరకు కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హోల్ సేల్ వ్యాపారులు లాభాలు చూసుకున్న తర్వాత రీసేల్ వ్యాపారులకు అమ్ము తున్నారు. అక్కడి నుంచి సాధారణ వినియోగదారులకు చేరే సరికి కూరగాయల ధరల రేటు మరింత ఎక్కువగా ఉంటున్నది. ధరల పెరుగుదలతో. చేసేదేమీ లేక కిలో కూరగాయలు కొనేవారు ప్రస్తుతం అరకిలో, పావుకిలోతో సరిపెట్టు కుంటున్నారు.
జిల్లా జనాభాకు ఏడాదికి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. జిల్లాలో ఇంతకంటే ఎక్కువగానే అంటే 1.95 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు పండుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరవాసుల అవసరాలను సైతం జిల్లాలో పండిన కూరగాయలే తీరుస్తుండడంతో ఇంకా అదనంగా 1.60 లక్ష ల మెట్రిక్ టన్నుల కూరగాయల అవసరం ఏర్పడుతున్నది. ఈ కొరతను అధిగమిం చేందుకు కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉద్యానవన శాఖ ప్రయత్నం చేస్తున్నా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూరగాయల సాగుకు అంతగా ఆసక్తి చూపడంలేదు.

కాస్తో..కూస్తో సాగు చేసిన పంటలు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో దెబ్బతిని రైతుల బతుకులు ఆగం అవుతున్నాయి. ఫలితంగా రైతుల ఆసక్తి తగ్గి..ఏటా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నది. 2021-22 వా నకాలంలో 62,598 ఎకరాల్లో పండ్లు, కూరగాయలను జిల్లా రైతాంగం సాగు చేసింది. 2022-23లో 64,397 ఎకరాల్లో, 2023-24లో 60,714 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ప్రస్తుత వానకాలంలో కేవలం 15,461 ఎకరా ల్లోనే ఉద్యాన పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తు న్నారు. ప్రస్తుతం ఉద్యానసాగు తగ్గడంతో చాలా వరకు కూరగాయలను జిల్లాకు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది.
పెరిగిన ధరలతో కూరగాయలను కొనలేకపోతున్నాం.. వారాంతపు సంతలో ఏ కూరగాయల ధర అడిగినా కిలో రూ.60 నుంచి రూ.80 పలుకుతున్నది. ఇదివరకు ఏదైనా కూరగాయ కిలో కొనేటోళ్లం.. ప్రస్తుతం పావు, అర కిలోతో సరిపెట్టుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల ధరలను నియంత్రించాలి.
-కూకుట్ల శ్రీలత, గృహిణి, కడ్తాల్ మండలం
నిత్యావసర ధరలు పెరుగడం వల్ల బతుకు భారమవుతున్నది. మార్కెట్లో ఇదివరకు తక్కువ ధరకు దొరికే కూరగాయలు, ఆకుకూరలు అమాంతం పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనలేని.. తినలేని పరిస్థితి. కిరాణం, వంట సామాను, గ్యాస్, బియ్యం, పాల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ధరలను అదుపు చేయాలి.
– కొమ్ము జెలమ్మ , గుర్రంగుట్ట కాలనీ, ఆమనగల్లు