కేశంపేట, సెప్టెంబర్ 21 : కేశంపేటతోపాటు కొత్తపేట గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం యూరియా వస్తుందన్న సమాచారాన్ని అందుకున్న రైతులు ఉదయమే పీఏసీఎస్ వద్దకు భారీగా చేరుకొని క్యూలో నిలబడ్డారు. పీఏసీఎస్‌కు 450 బస్తాల యూరియా మాత్రమే రావడం, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. విషయాన్ని గ్రహించిన పీఏసీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసుల పహారా మధ్య పంపిణీకి శ్రీకారం చుట్టారు. కేశంపేట కొనుగోలు కేంద్రంలో 450 బస్తాల యూరియాను అందజేయగా.. మరో 100 మంది రైతులకు తక్కువపడింది. కొత్తపేటలో 80 మందికి పైగా యూరియా అందలేదు. యూరియా అందని రైతులకు పోలీసుల పహారాలో టోకెన్లు అందజేశారు. యూరియా పంపిణీ తీరును సీఐ నరహరి పర్యవేక్షించారు.
కొందుర్గు : చౌదరిగూడ మండల పరిధిలోని పెద్దఎల్కిచర్ల గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం ఇక్కట్లు పడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి సత్యంముదిరాజ్ మాట్లాడుతూ ఈ నెల 13న టోకెన్లు ఇచ్చారని, 21న కూడా రైతులకు యూరియా అందజేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టోకెన్లు పొందిన రైతులు పూర్తిస్థాయిలో యూరియా అందకపోవడంతో తీవ్ర నిరాశతో ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలను ఆ దేవుడే కాపాడాలంటూ బోరున విలపించారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా ఇక్కడి ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణంగా రైతులకు అందజేయడంలేదని ఆరోపించారు. సాధారణ రైతులకు అందజేయాల్సిన యూరియా బస్తాలను లీడర్లకు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారని, ఈ విషయమై సామాన్య రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు.
రైతులను మోసం చేస్తే సహించేదిలేదని, పారదర్శకంగా యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏవో రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. రెండు రోజుల క్రితం చౌదరిగూడ రైతు వేదికవద్ద పంపిణీ చేశామని, అక్కడ యూరియా అందని రైతులు ఇక్కడకు కూడా వచ్చారన్నారు. 550 బస్తాల యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 10 మంది టోకెన్లు పొందిన రైతులు మిగిలారని, రెండు రోజుల్లో వారికి కూడా పూర్తిస్థాయిలో యూరియాను అందజేస్తామని తెలిపారు.