ఆమనగల్లు, సెప్టెంబర్ 23 : సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై పోస్టు పెట్టాడనే నేపంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త విజేశ్ నాయక్‌పై కేసు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విజేశ్నాయక్పై కేసు నమోదును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూసే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజేశ్నాయక్ను తీవ్ర వాదిగా, దొంగను అరెస్టు చేసినట్లు తెల్లవారుజామున 5 గంటలకు ఇంటి నుంచి ఠాణాకు తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అధికారం ఉందని మా కార్యకర్తలపై కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపైనా కేసులు నమోదు చేయాలని ఆయన పోలీసులకు సూచించారు. నిరసనలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ కుమార్, సీనియర్ నాయకులు శేఖర్, మహేశ్, వెంకటేశ్, గణేశ్, శంకర్, విక్రం, కిశోర్, జగన్, జ్యోతయ్య, సోమ్లా, శేఖర్, గణేశ్, రమేశ్‌గౌడ్, సతీశ్, మహేశ్, విమల, లలిత తదితరులు పాల్గొన్నారు.