ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలను అకాల వర్షాలు ఆగం చేశాయి. పంట నష్టపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సీఎం కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని, పరిహారాన్ని కూడా అందజేస్తామన్న సీఎం ప్రకటనతో అన్నదాతల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారాన్ని అందజేస్తూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పినా… రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుండడంతో రైతన్నల కండ్లల్లో ఆనందం నిండుతున్నది. రంగారెడ్డి జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగు కాగా, 3,371.42 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో నష్టపోయిన 2,344 మంది రైతులకు పరిహారం అందనున్నది.
రంగారెడ్డి, మే 6 (నమస్తే తెలంగాణ) : ఇది ఎండాకాలమా? లేక వర్షాకాలమా? అన్నట్టుగా ఉన్నాయి వాతావరణ పరిస్థితులు. పేరుకు ఎండా కాలమైనప్పటికీ.. ఒకవైపు పగటి పూట ఎండలు.. సాయంత్రం కాగానే, మేఘాలు కమ్ముకొని.. వరుణుడు కుండపోతగా వర్షిస్తుండడంతో జనజీవనం ఆశ్చర్యపోతున్నది. ఆరుగాలం పండించిన పంటలు చేతికి అందకపోవడంతో రైతన్నలకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ అకాల వర్షాలకు చేతికి అందొచ్చిన వరి, మామిడి లాంటి ప్రధాన పంటలు నేలపాలవుతున్నాయి. వందలు, వేల ఎకరాల్లో పలు రకాల పంటలు అకాల వర్షాల కారణంగా రైతులకు అందక, పండిన ధాన్యం మార్కెట్‌కు చేరుకోక, చేరుకున్నా గిట్టుబాటు ధర రాక, ధాన్యం వినియోగదారుడి చెంతకు చేరువకాక, పలు అంకాలలో రైతులు దెబ్బలు తింటూనే ఉన్నారు. ఇట్లా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం తడిసి ముద్దయిన సందర్భాలు ఇప్పటికే మూడుసార్లు సంభవించాయి.
అందుతున్న నష్టపరిహారం
ధాన్యం కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులను రాజులుగా చూడాలనుకున్న సీఎం కేసీఆర్ వారికి ఏర్పడిన దయనీయ పరిస్థితుల నుంచి ఆదుకునేందుకు ముందుకొచ్చి రైతన్నలకు అండగా నిలిచారు. పంట పొలంలోనే నీటిపాలైన వారికి ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఆ నష్ట పరిహారం జిల్లావ్యాప్తంగా అందుతూనే ఉంది. కాగా.. తడిసి మొలకెత్తిన ఆ ధాన్యాన్ని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అగమ్యగోచరమైన పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చి తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రకటించడంతో రైతుల కండ్లల్లో ఆనందం తొణికిసలాడింది. జిల్లా అంతటా అకాల వర్షాలకు ఇబ్బందులకు గురైన రైతులు ‘సీఎం కేసీఆర్.. ఆపద్బాంధవుడు’, ‘రైతు బాంధవుడు’ అని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
Kcr 04
3,371 ఎకరాల్లో పంట నష్టం
రంగారెడ్డి జిల్లాలో ఈ నెలలోనే ధాన్యం కొనుగోళ్లు షురూ కానున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులకు పెను విపత్తు చోటుచేసుకుంది. జిల్లా మొత్తంగా రబీ కాలంలో పలు రకాల పంటల సాగు 78,712 ఎకరాల్లో జరిగింది. అందులో ప్రధానంగా 65,190 ఎకరా (26,392.788 హెక్టార్లలో)లలో వరి పంటను సాగు చేశారు. 1,63,045 మెట్రిక్ టన్నుల ధాన్యానికి మించి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు తరలి రానున్న వరి ధాన్యం గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.2,060, గ్రేడ్ ‘బీ’ రకానికి రూ.2,040 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. వరి ధాన్యం సేకరణకు కావాల్సిన గన్నీ బ్యాగులను ఇప్పటికే దాదాపు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఆయా కేంద్రాలన్నింటికీ కలిపి 15 లక్షల గన్నీ బ్యాగులను సమకూర్చారు. ఇంత జరుగుతుండగానే అకాల విపత్తు ముంచుకొచ్చింది. రైతుల పాలిట అతి పెద్ద అగాథంలా నిలిచింది. జిల్లాలో ఇప్పటికే మూడు దఫాలుగా వర్షాలు అతి పెద్దగా కురవడంతో 3,371.42 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాగా.. 2,344 మంది రైతులు ఈ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నారు.
సీఎం కేసీఆర్‌తోనే అన్నదాతలకు మేలు
తడిసిన ధాన్యాన్ని ఎవ్వరూ కొనే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. పంట భూముల్లోనే ధాన్యం అకాల వర్షాలకు నేలపాలు కావడంతో, ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందించేందుకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి ఇప్పటికే పరిహారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో 2,344 మంది రైతులు పదివేల రూపాయల చొప్పున రూ.2,34,40,000లను అందుకొని లబ్ధి పొందనున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
పంట నష్టం వాటిల్లిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తున్నది. ఇప్పటికే కొంతమందికి అందించింది. కాగా, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. రైతులు ఇబ్బందులకు గురికావొద్దు. అధైర్యపడొద్దు. నష్టం వాటిల్లిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. జిల్లాలో 3,371.42 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 2,344 మంది రైతులు నష్టాన్ని చవిచూశారు. పంట ఎంత మేరకు నష్టం జరిగిందో చూసి అధికారులు ఒక అంచనాకు వస్తారు. పరిహారం కూడా సకాలంలోనే అందుతుంది.
సీఎం కేసీఆర్.. కొండంత అండ
– కెంచ కృష్ణయ్య, మాడ్గుల
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతులకు ఏ ఆపద వచ్చినా ఆదుకునే గొప్ప వ్యక్తి. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.పది వేలు అందించడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఏ ప్రభుత్వమూ రైతులకు సాయం అందించలేదు. రైతులకు సీఎం కేసీఆర్ సార్ కొండంత అండగా నిల్చి సాయం చేస్తున్నరు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సీఎం సారు పట్టించుకున్నట్టుగా ఎవ్వరూ పట్టించుకోలేదు. సారుకు ధన్యవాదాలు.
రైతులకు సాయం.. చాలా సంతోషకరం
– కట్ట బజారు, నల్లచెరువు
చేతికి అందొచ్చిన పంట భూమిలోనే పోతే.. రైతు బాధ అంతా ఇంతా కాదు. నాలుగు నెలలపాటు కష్టపడ్డ రైతుకు మిగిలేది కండ్ల నిండ నీళ్లేనా..? ప్రపంచం మొత్తానికి రైతు కష్టం చేస్తేనే కదా.. కడుపు నిండేది? అసొంటి రైతుకు అకాల వర్షం నష్టం చేస్తే.. సీఏం కేసీఆర్ సార్ పెద్ద మనసు చేసుకొని ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నడు. ఆ సారు సాయం ఊర్కనే పోదు. ఈ పరిహారంతో రైతులు కాస్త గట్టెక్కినట్టే..! రైతుల గుండెల్లో కేసీఆర్ సారు చెరిగిపోని ముద్ర ఏసుకున్నరు. కేసీఆర్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నరు.
కేసీఆర్ సార్.. ఆపద్బాంధవుడు
– ఈదయ్య, నల్ల చెరువు
కాలానికనుగుణంగా పడాల్సిన వర్షాలు ఇష్టారాజ్యంగా పడుతున్నయి. కోతకొచ్చిన పంటల్ని నాశనం చేస్తున్నయి. భూమి పాలవుతున్న పంటల్ని జూసి రైతులు ఏడ్చే పరిస్థితి. భూమి పాలైన పంటలకు పరిహారంగా ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్ ఆపద్బాంధవుడు. పదివేల పరిహారంతో రైతులకు భరోసా ఇస్తున్నడు. రైతులకు ఇంత మంచి సేవ చేస్తున్న కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటం. కేసీఆర్ సార్‌ను మించిన మొనగాడు ఈ దేశంలోనే ఎవరూ లేరు.