కబ్జా కోరల్లో… చెరువులు, కుంటలు
జిల్లాలో చెరువులు, కుంటలు, ఇరిగేషన్ కాల్వలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
- రంగారెడ్డి జిల్లాలో ఆగని ఆక్రమణలు
- బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ల్లో గుట్టుచప్పుడు కాకుండా
ఎన్ఓసీలు తీసుకుంటూ ప్లాట్లుగా మార్చి విక్రయాలు - జిల్లాలో 2,132 చెరువులు, కుంటలు
- వాటిలో సగానికి పైగా కబ్జా ఆరోపణలే..
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- ఓఆర్ఆర్ లోపలి గ్రామాల్లో రాత్రికి రాత్రే చెరువులు, కుంటలను పూడ్చేస్తున్న రియల్టర్లు
రంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో చెరువులు, కుంటలు, ఇరిగేషన్ కాల్వలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోని చెరువులు, కుంటల ఆక్రమణ పెద్ద ఎత్తున జరుగుతున్నది. చెరువులు, కుంటల పక్కన ఉన్న పట్టా భూములు ఉన్న వారు రాత్రికి రాత్రే మట్టితో పూడ్చి తమ భూముల్లో కలిపేసుకుంటున్నారు. అదేవిధంగా మరికొన్ని చోట్ల రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికారుల అండదండలతో చెరువులు, కుంటలను మాయం చేస్తున్నారు. బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లోనూ గుట్టుచప్పుడు కాకుండా ఎల్వోసీలు తీసుకొచ్చి ప్లాట్లుగా మార్చి ప్రజలకు విక్రయిస్తున్నారు. అలాగే, ఔటర్ లోపలి మున్సిపాలిటీలైన తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్ తదితర మున్సిపాలిటీల్లోని చెరువులు, కుంటలు రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. ఈ వ్యవహారంపై రైతులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ కాల్వలు కూడా..
జిల్లాలోని చెరువులు, కుంటలకు నీరందించే ఇరిగేషన్ కాల్వలు కూడా ఎక్కడికక్కడ కబ్జాకు గురవుతున్నాయి. అనాజ్‌పూర్ సమీపంలోని ఇందిరాసాగర్ చెరువుకు ఆదిబట్ల నుంచి మంగల్‌పల్లి, శేరిగూడ, ఇబ్రహీంపట్నం, నాగన్‌పల్లి గ్రామాల మీదుగా పులిందర్ వాగు నుంచి నీరందుతుండగా పలుచోట్ల కబ్జాకు గురైంది. బ్రాహ్మణపల్లి చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వను పూడ్చి దానిపైనే నిర్మాణాలు చేపట్టారు. చేవెళ్ల మండలంలోని చందనవెల్లి నుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు నీరొచ్చే ప్రధాన రాచకా ల్వ కూడా ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైంది. రియల్ఎస్టేట్ సంస్థలు రాచకాల్వను కబ్జాచేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాయి.
రాచకాల్వపై ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ విద్యాసంస్థ బ్రిడ్జిని సైతం నిర్మించింది. సుమారు 1250 హెక్టార్ల ఆయకట్టుకు నీరందించే ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు నీరు వచ్చేందుకు ఈ కాలువే ప్రధానమైంది. ఈ కాల్వ కబ్జాకు గురికావడంతో చెరువు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రావిర్యాల పెద్దచెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వలూ ఆక్రమణకు గురయ్యాయి. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆయా రియల్ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కై ఆక్రమణలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. చెరువులు, కుంటల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు శూన్యమేనని వారు మండిపడుతున్నారు.

మాయమవుతున్న మాసబ్‌చెరువు..
మాసబ్‌చెరువు క్రమంగా మాయవుతున్నది. ఈ చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి పరిశీలించారు. అప్పటికే రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిలో ఆదిత్య నగర్ పేరిట వెంచర్ చేసి ప్లాట్లను చేసి విక్రయించారు. అలాగే, ఈ చెరువు బఫర్‌జోన్‌లోనూ యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతు న్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు పెద్దచెరువు, పెద్దఅంబర్‌పేట ఈదుల చెరువులు సైతం కబ్జాకు గురయ్యాయి.యాచారం మండలంలోని మొగుళ్లవంపు మొద్దులకుంట, కడ్తాల్‌లోని వంపుగూడ చెరువు, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలోని పడమటి చెరువును ఏకంగా కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన కాల్వ కబ్జా.. నీరు లేక ఎండిపోతున్న బ్రాహ్మణపల్లి చెరువు
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడంతో.. నాలుగైదు చెరువులకు నీరందడం లేదు. బ్రాహ్మణపల్లి చెరువు కూడా ఎండిపోతున్నది. అదేవిధంగా పక్కనే ఉన్న అరుంధతినగర్ పరిసరాల్లో ఉన్న చెరువును సైతం ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు రియల్ఎస్టేట్ వ్యాపారులు. ఇంజాపూర్లోఉన్న గూడెంకుంట, మన్నెగూడలోని ఎర్రకుంట, ఎంఎంకుంటలోని కొత్తచెరువు కబ్జాకు గురవుతున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
జిల్లాలో 2,132 చెరువులు, కుంటలు..
జిల్లాలో 2,132 చెరువులు, కుంటలున్నాయి. ఇటీవల వర్షాలు కురువకపోవడంతో అవి ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. రాత్రి వేళల్లో వాటిలో మట్టి నింపి పూడ్చివేస్తున్నారు. మరికొన్ని చోట్ల చెరువుల్లోకి నీరొచ్చే ఇరిగేషన్ ప్రధాన కాల్వలూ కబ్జాకు గురై చెరువులకు నీరొచ్చే దారులు మూసుకుపోతున్నాయి.
గత బీఆర్ఎస్ హయాంలో మరమ్మతులు చేసినా..
రాచకాల్వ పలు చోట్ల అక్రమాలకు గురవుతున్నది. చేవెళ్ల మండలంలోని చందనవెల్లి నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు ఉన్న ఈ కాల్వ ఎక్కడికక్కడే కబ్జాకు గురైంది. దీంతో రాచకాల్వ నుంచి ఇబ్రహీంపట్నం చెరువుకు నీరు రావడం ఆగిపోయింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి రాచకాల్వకు మరమ్మతులు చేపట్టగా.. ఇటీవల రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడికక్కడ కబ్జా చేయడంతో కాల్వ పూర్తిగా మూసుకుపోయింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

