జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం అటకెక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు – మన బడి’ని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చి ఆధునీకీకరణ కోసం నిధులు విడుదల చేశారు. పాఠశాలలకు కమిటీలనూ ఏర్పాటు చేయడంతోపాటు కమిటీల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించగా, అభివృద్ధిపై దృష్టి సారించడంలేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఎంపికైన 700 పాఠశాలలకు జనవరి నాటికి రంగులు వేయడం పూర్తి చేయాల్సి ఉన్నది. అధికారికంగా పరిపాలన అనుమతులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ రంగు డబ్బాలు తీసుకొచ్చి పాఠశాలల్లో మూలన పడేశారు. అంతేకాకుండా పాఠశాలల్లో చేసిన ఇతర పనులకూ బిల్లులు రాలేదని ఏజెన్సీలు రంగులు వేయడం మానేశారు.
– రంగారెడ్డి, జనవరి 28 (నమస్తే తెలంగాణ)
పాఠశాలల భవనాలకు రంగులు వేయడం, బెంచీల కోసం, వంట గదుల నిర్మాణం, విద్యార్థులకు తాగునీరు, వంటి మౌలిక వసతులు కల్పించేందుకు రూ.23 కోట్ల, తొమ్మిది లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్ని పాఠశాలల్లో మాత్రమే పనులు చేపట్టగా, వాటికీ బిల్లులు ఇవ్వడంలేదని కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. బెంచీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నేలపై కూర్చోవాల్సి వస్తున్నది.
ఆయా పాఠశాలలకు మరమ్మతు చేయించకపోవడంతో సరైన వసతులు లేక అమ్మ ఆదర్శ పాఠశాలల లక్ష్యం నీరుగారుతున్నది. ఆధునీకీకరణకు రూ.23 కోట్ల, తొమ్మిది లక్షలను మంజూరు చేసి మహిళా సంఘాలకు బాధ్యతను అప్పగించింది. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీల్లో ఉండడం వల్ల పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించేవారు. పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా పాఠశాలలను పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పాత ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రంగులు వేయడానికి ఆరు మాసాల కింద రంగు డబ్బాలను తీసుకొచ్చారు. కానీ, పరిపాలన అనుమతులు లేవని రంగులను ఏజెన్సీ వారు తిరిగి తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధునీకీకరణ బాధత్యలను విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పజెప్పాలి. మహిళా సంఘాలకు అప్పజెప్పితే వారు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణపై అశ్రద్ధ వహించడం సరికాదు.
– నిట్టు జగదీశ్వర్, విద్యార్థి సంఘం నాయకుడు