రంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : మాడ్గుల మండలంలోని అందుగుల వాగు నుంచి అడ్డూ అదుపూలేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారపార్టీ నేతలు, పోలీసుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలున్నాయి. వందలాది ట్రాక్టర్లతో వాగు నుంచి ఇసుకను తీసుకొచ్చి ఒకచోట డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నది. ఈ అక్రమ దందాపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బెదిరించడంతోపాటు దాడులకు పాల్పడుతున్నది.
మాడ్గుల మండలంలోని అందుగుల, ఇర్వేన్ నల్లచెరువు, గిరికొత్తపల్లి, నర్సంపల్లి వంటి గ్రామాల్లో ఈ వాగు విస్తరించి ఉన్నది. మాడ్గులతోపాటు చుట్టుపక్కల మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసమని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు వందకు పైగా ట్రాక్టర్లుండగా.. కేవలం వాగు నుంచి ఇసుకను బయటికి తీసుకొచ్చేందుకే వాటిని వినియోగిస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీ నాయకులు, పోలీసుల అండదండలతో ఇసుకాసురులు రాత్రిపూట వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఒక చోట పెద్ద ఎత్తున డంప్ చేసి.. గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లోనే టిప్ప ర్ల ద్వారా నగరానికి తరలించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
మాడ్గుల మండలంతోపాటు ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లోనూ ఇసుక అక్రమ వ్యా పారం జోరుగా సాగుతున్నది. మాడ్గుల మండలంలోని వాగు నుంచి ఇసుకను తీసుకొచ్చి.. ఆమనగల్లు, తలకొం డపల్లి, కడ్తాల్‌లో పెద్ద ఎత్తున ఇసుక ఫిల్టర్లను ఏర్పాటుచేసి కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారు. ఇసుకను యథేచ్ఛగా తోడేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందుగుల, ఇర్విన్, కొత్తపల్లి, నర్సంపల్లి తదితర గ్రామా ల్లో విస్తరించి ఉన్న వాగు నుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజూ ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో వాగులో నీరుండటంతో ఇసుక తరలింపునకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వాగులో నీరు ఇంకిపోవడంతో ఇసుకను యథేచ్చగా తోడేస్తున్నారు. గతంలో ఈ గ్రామాల్లో రెండువందల నుంచి మూడు వందల ఫీట్ల లోతు బోర్లు వేస్తే పుష్కలంగా నీళ్లు వచ్చేవి. ఇసుక తవ్వకాలతో ఐదువందల నుంచి వెయ్యి ఫీట్లు బోర్లు వేసినా నీరొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చే ఇసుకను ఒక్కో ట్రాక్టర్‌కు రూ. ఐదు నుంచి రూ. పదివేల వరకు కొంటున్న కొందరు ఇసుక వ్యాపారులు.. దానిని రాత్రి సమయాల్లో టిప్పర్ల ద్వారా హైదరాబాద్ నగరానికి తరలించి.. ఒక్కో టిప్పర్‌కు రూ. ఇరవై నుంచి రూ. ముప్పైవేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఇసుక అక్రమ వ్యాపారంపై ఎవరైనా అధికారులకు ఫిర్యా దు చేస్తే బెదిరింపులతోపాటు దాడులకు పాల్పడుతున్నారు ఇసుక అక్రమ వ్యాపారులు. గతంలో ఇసుక అక్రమ వ్యా పారంపై ఉన్నతాధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా అతడిపై దాడి జరగడంతో.. ఎవరూ ఫిర్యా దు చేసేందుకు ముందుకు రావడంలేదు. అందుగుల, ఇర్విన్, నల్లచెరువు, దొడ్లపాడు, నాగిళ్ల, కొత్తపల్లి, నర్సంపల్లి, గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకొచ్చునన్న ప్రభుత్వ ప్రకటనను ఆసరా గా చేసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలింపు అనుమతిని అధికారులకు చూపుతూ అడ్డూఅదుపూ లేకుండా ఇసుకను తరలి స్తూ.. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో వారి వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతున్నట్లు సమాచారం. ఇసుక తరలింపు
పర్మిషన్ పత్రాల్లో తేదీలను తారుమారుచేసి ఇసుక వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇకనైనా అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి అక్రమంగా ఇసుకను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజులు కోరుతున్నారు.