రంగారెడ్డి, మే 21 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో మరో 25వేల ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల అమలు పేరుతో ఈ అసైన్డ్ భూములను సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా సాగులో లేని అసైన్డ్ భూములను సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారుల్లోని రంగారెడ్డిజిల్లా పరిధిలో గల సుమారు 25వేల ఎకరాల అసైన్డ్ భూములను దశలవారీగా సేకరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డిజిల్లా పరిధిలోని భూములపై సర్కారు ఎప్పటినుంచో కన్నేసింది. ఇప్పటికే జిల్లా పరిధిలోని ఫ్యూచర్‌సిటీ పేరుతో ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొంత భూమిని స్వాధీనం చేసుకుని ఆ భూములను టీఎస్ఐఐసీకి అప్పగించింది. రంగారెడ్డిజిల్లా పరిధిలోని పలు మండలాల్లో విలువైన అసైన్డ్ భూముల జాబితాను అధికారులు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఐదువేల ఎకరాల భూమిలో దాదాపు మూడువేల ఎకరాలను తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు మరికొంత భూమిని టీఎస్ఐఐసీకి కేటాయించింది. దీంతోపాటు టీఎస్ఐఐసీకి మొత్తం పదివేల ఎకరాల భూమి కావాలని కోరినట్లు తెలిసింది.
భూములు లేని నిరుపేదలను గతంలో గుర్తించిన సర్కారు ప్రభుత్వ భూములను, అసైన్డ్ పట్టాలను నిరుపేదలకు కేటాయించింది. అందులో భాగంగానే రంగారెడ్డిజిల్లాలో కూడా నిరుపేదలను గుర్తించి పట్టాలను పంపిణీ చేసింది. కాని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములను టార్గెట్‌గా చేసుకుని పేదల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలో 800 ఎకరాలు, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్, జబ్బార్‌గూడ, తిమ్మాయపల్లి, మహేశ్వరం మండలంలోని నాగిరెడ్డిపల్లి, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం, చేవెళ్ల మండలంలోని ఎన్కేపల్లి వంటి గ్రామాలతో పాటు యాచారం మండలంలోని కొత్తపల్లి వంటి గ్రామాల్లో అసైన్డ్ భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది.
ప్రభుత్వం పేదలకిచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారి జాబితాను తయారుచేసే పనిలో ఉంది. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా అందినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసైన్డ్ భూములను పొందిన లబ్ధిదారుల జాబితాను తీసుకుని ప్రస్తుతం ఆ భూముల్లో లబ్ధిదారులున్నారా.. లేక ఇతరులున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు. చట్టవిరుద్దంగా అసైన్డ్ భూములను ఎవరైనా కొనుగోలు చేసినట్లయితే తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డిజిల్లా పరిధిలోని శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లోని ఎన్కేపల్లి, పెద్దమంగళారం, సీతారాంపూర్, దామరపల్లి, పెద్దవీడు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములను పారిశ్రామిక పార్కులు హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీతోపాటు రైల్వే శాఖకు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే మూడువేల ఎకరాలకు పైగా సర్కారు ఇచ్చిన అసైన్డ్‌మెంట్ భూములను విక్రయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అసైన్డ్ భూములపై క్రయవిక్రయాలు చట్టపరంగా నిషేధం ఉన్నది. 1977 ల్యాండ్ ట్రాన్స్ఫర్ నిషేధిత చట్టం ప్రకారం అక్రమ లావాదేవీలు జరిపితే తిరిగి ఆ భూములను సర్కారు తీసుకునే అధికారం ఉన్నది. ఇప్పటికే జిల్లాలో 3వేల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా తుక్కుగూడ, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, వంటి ప్రాంతాల్లో అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ భూమిని వెంటనే సర్కారుకు అప్పగిస్తే ఆ భూమిలో 300 చదరపు గజాల ప్లాటును అందించి మిగతా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సర్కారు భావించింది. అక్రమంగా కొనుగోలు చేసిన భూమిని వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేయకపోయినట్లయితే ఎలాంటి నోటీసులు లేకుండా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సర్కారు నిర్ణయించింది. అలాగే, అసైన్డ్‌మెంట్ భూములను పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లయితే పరిహారంతోపాటు ప్లాట్లు కూడా అప్పగించాలని నిర్ణయించింది. దీంతో రంగారెడ్డిజిల్లాలోని అసైన్డ్‌మెంట్ భూములను సర్కారు పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది.