తాండూరు, డిసెంబర్ 11 : తాండూరు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్, వంట నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఉడికీఉడకని అన్నం తిని తొమ్మిది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారిని చూసేందుకు బుధవారం తల్లిదండ్రులు పాఠశాలకు రాగా పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో చెట్ల కిందే బాధపడుతూ కూర్చున్నారు. తమ కుమార్తెల ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన చెందుతూ కన్నీటిపర్యం తమయ్యారు. కాగా ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు శ్రావణి, శైలు, బులిబాయి, గీత, వైష్ణవి, దీపిక, మీనాక్షి, మధు, నీలావతిలకు అక్కడి పాఠశాలలోనే చికిత్స అందిస్తుండగా.. ఆ గదికెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న సరుకులను క్షుణ్ణంగా పరిశీలించారు.
హాస్టల్లో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీటిని పరీక్షించారు. పాత బియ్యాన్ని తరలించి మంచి బియ్యాన్ని తెప్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ మాట్లాడు తూ.. వసతి గృహంలో స్టూడెంట్స్‌కు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆశ్రమ పాఠశాల, వసతి గృహం పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లోని విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, సరిగ్గా ఉడకని కిచిడీ తినడంతోనే వారు అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు.
అస్వస్థతకు గురైన విద్యార్థినులకు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. తల్లిదండ్రులు అధైర్యపడొద్దని.. స్టూడెంట్స్ కోలుకుంటున్నారన్నారు. తాగునీటితో కొన్ని అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు ఉండడంతో.. నీటి నాణ్యతను పరిశీలించేందుకు 12వేల హెచ్‌టూఎస్ టెస్ట్ వైల్ ను కొనుగోలు చేశామని.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉందా..? అని తెలుసుకునేందుకు అది ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్ర మంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన, టీటీడీవో కమలాకర్‌రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఎంఈవో వెంకటయ్యగౌడ్ ఉన్నారు.
అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినులు అక్కడి పాఠశాలలోనే వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు, మీడియాను పాఠశాలలోకి వెళ్లకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు దవాఖానల్లో కాకుండా ఆశ్రమ పాఠశాలలోని ఓ గదిలో సీక్రెట్‌గా చికిత్స అందిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. వసతి గృహాల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పరిగి : విద్యార్థినులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పరిగి పట్టణంలోని గిరిజన బాలికల, మహాత్మాజ్యోతిబా ఫూలే బాలికల గురుకులాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదులు, వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న బియ్యం సరిగ్గా లేకుంటే తిరిగి పంపించాలని అక్కడి వార్డెన్లకు సూచించారు. విద్యార్థినులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. ఆయన వెంట ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, తహసీల్దార్ ఆనంద్‌రావు, ఎంపీడీవో కరీం, ప్రిన్సిపాళ్లు హరిత, ఉమాసుజాత ఉన్నారు.