యాచారం, మార్చి 21 : గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర్లకుంటతండాలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది. మంగలిగడ్డతండా, పోతుబండతండా, మర్లకుంటతండాలకు చెందిన గిరిజన రైతులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీక్షకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్, రమేశ్ రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి జర్పుల లక్పతినాయక్, రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షుడు భీమ్లాల్ పవార్, మహిళా జనరల్ సెక్రటరీ శాంతిబాయి, విద్యార్థి సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గణేష్ నాయక్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు గిరిజనుల పట్టా భూములు తీసుకోవద్దని, వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజన తండాలకు చెందిన రైతుల భూముల్లో నుంచి 330 ఫీట్ల రోడ్డు నిర్మిస్తే వారు ఎలా బతకాలని సర్కారును ప్రశ్నించారు. ఈ రోడ్డుతో 18 తండాల రైతులు తమ భూములు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. 350 ఎకరాల భూమిని ప్రొహిబిటెట్ లిస్టు నుంచి ప్రభుత్వం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.