యాచారం, ఏప్రిల్ 25 : గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ మహిళా రైతుల హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యురాలు ఆశలత డిమాండ్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర్లకుంటతండాలో గిరిజన రైతులు చేపట్టిన రిలే దీక్ష 42 రోజులకు చేరుకోగా.. ఆ శిబిరాన్ని శనివారం ఆశలత, పిలుపు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జనార్దన్, చైతన్య మహిళా సంఘం సభ్యురాలు గిరిజ సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశలత మాట్లాడుతూ.. గిరిజన రైతులు గత 42 రోజులుగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం తగదన్నారు.
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎన్నికల ముందిచ్చిన హామీప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయడంతోపాటు.. రైతుల భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్‌సిటీని రద్దు చేసి ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం రైతులకు భూములను తిరిగివ్వాలన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులను వెంటనే నిలిపేసి, రోడ్డుకు పట్టా భూములను తీసుకోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ నుంచి టీజీఐఐసీ పేరును తొలగించి వెంటనే రైతుల పేర్లను నమోదు చేయాలన్నారు. రైతుల పట్టా భూములకు రిజిస్ట్రేషన్‌తో సహా పూర్తి హక్కులను కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజన రైతుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉధ్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, గిరిజన నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
మండలంలోని మర్లకుంటతండాలో గిరిజన రైతులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు తమ భూములను ప్రభుత్వం తీసుకుంటే పశువులు, మూగజీవాలను ఎక్కడ పోషించుకోవాలని దీక్షలో మేకపిల్లను ఉంచి నిరసన తెలిపారు. మేకపిల్లకు పూలమాల వేసి దీక్షలో ఉంచారు. గిరిజన బతుకులను ఆగం చేసే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రద్దు చేసే వరకు దీక్ష చేస్తామన్నారు.