పరిగి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు దన్నుగా నిలిచి వారు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. అలవికాని హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ సర్కారు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. తద్వారా ప్రతి సీజన్లోనూ రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రాక తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. తక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే సమయంలో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆ మరుసటి వారమే క్వింటాలుకు ఒకటి నుంచి రెండు వేల రూపాయలు తగ్గించడం ద్వారా రైతులను నట్టేట ముంచుతున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం జనవరి 27వ తేదీన వేరుశనగను విక్రయించేందుకు పరిగి మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపారులు కూడబలుక్కొని క్వింటాలుకు వెయ్యి రూపాయలు తగ్గించడంతో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మళ్లీ ఏడాది తర్వాత వేరుశనగ రైతులే ధరల కోసం రోడ్డెక్కారు. గత వారానికి ఈ నెల 25వ తేదీకి వేరుశనగ క్వింటాలుకు రెండు వేలు తగ్గించడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వేరుశనగ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6783 ప్రకటించగా గత శుక్రవారం పరిగి మార్కెట్లో రూ.6500 వరకు విక్రయింపబడింది.
ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే సుమారు రూ.300 తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేసినా రైతులు వేరుశనగ విక్రయించారు. ఈ శనివారం వ్యాపారులు సిండికేట్‌గా మారి వేరుశనగకు తక్కువ కోట్ చేశారు. సుమారు 800 లాట్స్కుగాను ఆన్లైన్లో 50 పైగా లాట్స్‌కు కనీసం ఒక్క టెండర్ కూడా రాకపోగా 150 లాట్స్‌కు తక్కువ ధర వేసినట్లు అధికారులే చెబుతున్నారు. సరాసరిన శనివారం అత్యధిక రైతుల వేరుశనగకు రూ.4500 ధర వేశారని రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు నుంచి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి వరకు ర్యాలీ చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. రీ టెండర్లు పిలిచామని, ధర పెరుగుతుందని అధికారులు చెప్పడం తప్ప ఆచరణ జరుగలేదు.
– పరిగి, జనవరి 27
ఏడాదైనా అమలుకు నోచుకోని డైరెక్టర్ హామీలు..
పరిగి మార్కెట్లో వ్యాపారుల మోసాలు ఆగడం లేదు. గత సంవత్సరం జనవరిలో వేరుశనగ రైతులు ఆందోళన చేపట్టి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. జనవరి 27వ తేదీన వికారాబాద్ ఆర్డీవో రైతుల వద్దకు వచ్చి సమస్యలు విని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మరుసటి రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పరిగి మార్కెట్‌ను సందర్శించారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లయితే మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో వేరుశనగ కొనుగోలుకు సైతం చర్యలు తీసుకుంటామన్నారు. కమీషన్ ఏజెంట్లు తక్‌పట్టీలు ఇవ్వకపోవడంపై ఆమె స్పందిస్తూ తక్‌పట్టీలు ఇవ్వని అంశంపై వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
పరిగిలో ఒకేరోజు బీట్లు ఉండడం వల్ల ఒకేసారి అధిక మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయని, రెండు రోజులు బీట్లు జరిపేలా ఆలోచిస్తామన్నారు. ఉదయం 10 గంటల లోపు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వెంటనే బీట్లు నిర్వహించి సాయంత్రం లోపు తూకం పూర్తయ్యేలా చూడాలని, మధ్యాహ్నం వచ్చిన వాటిని మరుసటి రోజు బీట్లు వేసేలా చూడాలన్నారు. అవసరమైతే చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ యార్డులో వృథాగా పడివున్న వేయింగ్ మిషన్‌ను మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చారు. కమీషన్ ఏజెంట్లు రూ.2 కంటే ఎక్కువ కమీషన్ తీసుకుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు వచ్చేలా చూడాలన్నారు. ఇందులో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. గత శనివారం రైతుల ఆందోళనతో వేరుశనగ బీట్లు ప్రతి మంగళవారం చేపడతామని మార్కెట్ కమిటీ వారు ఆదరాబాదరాగా ప్రకటించారు. ధరల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం.
నష్టపోతున్న సీఎం నియోజకవర్గ రైతులు…
పరిగి మార్కెట్‌కు అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల, బొంరాస్‌పేట మండలాల పరిధిలోని రైతులు వేరుశనగ తీసుకొస్తుంటారు. ప్రతి సంవత్సరం పరిగి మండలం కంటే అత్యధికంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులే వేరుశనగ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. తక్కువ మోతాదులో వేరుశనగ వచ్చినప్పుడు అధిక ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ధరలు తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. ఈ విషయమై రైతులు నిలదీసిన సమయంలో వచ్చే వారం నుంచి తగిన చర్యలు ఉంటాయని అధికారులు చెప్పడం తప్ప ఎక్కడా ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఈసారి ఆన్లైన్లో బిడ్డింగ్ వేసి కొనుగోలు చేపడుతున్నా, స్థానిక వ్యాపారులే కూడబలుక్కొని ఆన్లైన్లో తాము నిర్ణయించిన ధరలు వేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. తక్కువ బస్తాలు గల లాట్‌కు అధిక ధర నిర్ణయించి, మిగతా 95శాతం వేరుశనగకు తక్కువ ధర కోట్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. వ్యాపారుల మోసంతో ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ రైతులు అత్యధికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నారు.