ప్రస్తుత కాలంలో పిల్లల ముఖం చూడనిదే తండ్రులు ఒక్క అడుగు బయటకు వేయడంలేదు. చిన్నారులతో చిన్నారిలా మారి వారితో సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ తండ్రులు, తాతలు మిస్ అయిన చిన్నారుల ప్రేమను పొందేందుకు ఇష్టపడుతున్నారు. నేటితరం పిల్లలకు నాన్నే నేస్తం. పొద్దంతా అమ్మే చూసుకుంటున్నా, గోరు ముద్దలు తినిపిస్తున్నా.. నాన్న రాగానే మాత్రం చటుక్కున చంకనెక్కేస్తున్నారు. గట్టిగా హగ్ చేసేసుకుంటున్నారు. నాన్న.. పొద్దున అమ్మ తిట్టింది, నేనడిగింది ఇవ్వట్లేదు అంటూ కంప్లయింట్లు చేసేస్తున్నారు. నాన్నకు పిల్లలు ఎంత దగ్గరవుతున్నారనేందుకు ఇవే నిదర్శనాలు.
-పెద్దఅంబర్‌పేట, జూన్ 15
Dharma Reddy | పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారంలోని వైఎస్సార్‌నగర్‌లో అన్నం నర్సింహారెడ్డి, లలిత దంపతులు రెండు దశాబ్దాలుగా నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు అన్నం ధర్మారెడ్డి. ఇతనికి వివాహమై, దాదాపు పదేండ్లకు పైగా వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ధర్మారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. నర్సింహారెడ్డికి 2008 పక్షవాతం వచ్చింది. దీంతో మహారాష్ట్ర గుల్బర్గాలో ఏడాదిపాటు చూపించారు. మందుల ఖర్చులు పెరిగాయి. రవాణా కూడా భారమైంది. ఆ తర్వాత స్థానికంగా మందులు తినిపించారు. రెండేండ్ల తర్వాత ఆరోగ్యం కొంచెం నయమైంది. ఆ తర్వాత ఓ రోజు బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. శరీరంలో ఎడమవైపు భాగం పడిపోయింది.
మళ్లీ తల్లితో కలిసి ధర్మారెడ్డి నిత్యం హాస్పిటళ్ల బాట పట్టాడు. తండ్రిని బాగా చూసుకోవాలని తపించాడు. అప్పుడే నర్సింహారెడ్డి మోకాళ్ల చిప్పలు కూడా అరిగిపోయాయి. ఆపరేషన్ చేయించినా సక్సెస్ కాలేదు. 2012లో కిడ్నీల సమస్య వచ్చింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వాంతులు అయ్యాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 2015లో ఈఎస్ఐకి తీసుకెళ్లగా పిత్తాశయంలో ఇన్ఫెక్షన్తో పరిస్థితి విషమంగా ఉన్నదని, ఆపరేషన్ చేసినా కష్టమేనని వైద్యులు చెప్పినా.. ధర్మారెడ్డి ఎక్కడా తగ్గలేదు. ‘మీ నాన్న అయితే ఇలానే చేస్తారా?’ సార్ అంటూ వైద్యులను ఎదురు ప్రశ్నించాడు.
ఆపరేషన్ చేయించాడు. 2016లో మళ్లీ సమస్య వచ్చింది.. నెల బతకడమే కష్టమని వైద్యులు తేల్చేశారు. మళ్లీ ఆపరేషన్ చేయించాడు.. 2019 కిడ్నీ సైజ్ మరింత తగ్గిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దవాఖాన వాళ్లే వెళ్లిపోమన్నా.. కొడుకు మాత్రం నాన్నను బతికించుకుంటానని శపథం పన్నాడు. ఒకటి తర్వాత మరొకటి జబ్బులు వచ్చి 13 ఏండ్లుగా నర్సింహారెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. అయినా నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఆ కొడుకు.
నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కనీసం కదలలేడు. ఏ విషయాన్ని మాట్లాడలేడు. దీంతో ధర్మారెడ్డి అన్నీ తానై తండ్రిని కంటిరెప్పలా కాపాడుకుంటున్నాడు. లేచిందే మొదలు నాన్నకు బ్రెష్ చేపించడం, స్నానం చేయించడం, శుభ్రమైన వస్ర్తాలు తొడిగించడం అన్నీ ఒకటి తర్వాత మరొకటి చేసేస్తున్నాడు. కనీసం కూర్చోలేని తండ్రికి తోడుగా నిలిచాడు. కనీసం అన్నాన్ని కూడా నమలలేని నాన్నకు వైద్యుల సూచనలతో లిక్విడ్ రూపంలో ఆహారాన్ని అందిస్తున్నాడు. రాగి జావ, పాలు, బ్రెడ్డు, అన్నాన్ని మెత్తగా మిక్సీ చేసి తాగిస్తున్నాడు.
మల, మూత్ర విసర్జనను నిత్యం శుభ్రం చేస్తున్నాడు. సమయానికి మందులు ఇస్తున్నాడు. ఎప్పుడు 48 గంటలపాటు మందులు ఆపేసినా మనిషి బతకడం కష్టమే అని వైద్యులు చెప్పడంతో మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాన్న చేసే సైగలతోనే విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కుటుంబంలో గొడవలు జరిగినా నాన్నే మొదటి ప్రాధాన్యం అని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత భార్య, తల్లితో కలిసి నాన్నకు సేవ చేస్తున్నాడు.
నర్సింహారెడ్డి అనారోగ్యంతో మంచాన పడితే.. ఆ మంచాన్నే హాల్లోకి మార్చాడు ధర్మారెడ్డి. ‘నాన్న విలువ పిల్లలకు తెలియాలి కదా’.. అదేంటి ఓ రూంలో వేస్తే సరిపోతుందిగా అని బంధువులు ఇచ్చే ఉచిత సలహాకు ఆయనిచ్చిన సమాధానం ఇది.
13 ఏండ్లుగా నాన్నను విడిచి ఒక్క రాత్రి కూడా ఎవరింటికీ వెళ్లలేదని చెప్తున్నాడు ధర్మారెడ్డి. ఏ చుట్టాల ఇంటికి వెళ్లినా, దావత్‌లకు వెళ్లినా.. రాత్రికే ఇంటికి వచ్చేస్తాడు. ఆస్తులు సంపాదించి ఇవ్వలేదనో, భారంగా మారారనో తల్లిదండ్రులను అనాథలుగా మారుస్తున్న ఎందరో పిల్లలకు ధర్మారెడ్డి ఆదర్శం.
నాన్న నిజంగా గ్రేట్. మేం చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎలా చూసుకున్నాడో.. ఇప్పటికీ వాళ్ల నాన్నను అలాగే చూసుకుంటున్నాడు. తాతను పలుకరించకుండా నాన్న ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టడు. మాకు టైం కేటాయిస్తూనే తాతకు అన్ని పనులు చేస్తడు. నాన్న లేనప్పుడు నానమ్మ, అమ్మ, మేం ఇద్దరం సాయం చేస్తుంటాం. అప్పట్లో నానమ్మ కూడా పనికి వెళ్లేది. అప్పుడు అమ్మ, మేము తాతకు సాయం చేసేవాళ్లం. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా సాయంత్రం రాగానే తాతయ్య దగ్గరికి వెళ్లిపోతాడు. సెలవు రోజు వస్తే ఎక్కువ టైం నాన్న తాతయ్యతోనే ఉంటాడు. ఆయనకు పాత పాటలు వినిపిస్తూ ఉత్సాహాన్ని నింపుతడు. నాన్నను చూశాకే తెలిసింది. మేం కూడా నాన్న బాటలోనే నడుస్తం. కనిపెంచినోళ్లకు సేవ చేయడం అదృష్టమని నాన్న చెప్తుంటాడు.
– అన్నం యోగేశ్వర్‌రెడ్డి (ఇంటర్ ఫస్టియర్), ఈశ్వర్‌రెడ్డి (తొమ్మిదో తరగతి)