ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. భర్త మృతి చెందినవారికి, ఒంటరి మహిళలకు ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని ‘ఆసరా’ పథకం కింద పింఛన్లను అందజేస్తున్నది. తెలంగాణ రాక ముందు గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇస్తే అవి ఖర్చులకు సరిపోక ఇబ్బందులు పడేవారు. నిరాదరణకు గురైన మహిళలు గౌరవంగా బతకాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా రూ.2,016 పింఛన్‌ను అందజేస్తున్నది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వితంతువులు 85,165 మంది, ఒంటరి మహిళలు 6,497 మంది ఆసరా పింఛన్ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. సర్కారు అందిస్తున్న చేయూతతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, మార్చి 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనదైన పాలన వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నం. దీంతోపాటు గత పాలకుల హయాంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవనం కల్పించుకుంటున్నం. పొరుగు పార్టీల పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోయిన్రు. ప్రజా సంక్షేమానికి గత పాలకులు తిలోదకాలిచ్చి జన జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన్రు. గత పాలకులను నమ్మిన లక్షలాది మంది తెలంగాణవాసుల బతుకులు చితికిపోయాయి. తెలంగాణ రాకతో జన జీవనాన్ని పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి బతికించుకుంటున్నం. పోరాడి గెల్చుకున్న ప్రత్యేక తెలంగాణలో మన బతుకులు మారాలని సీఎం కేసీఆర్ కార్యదీక్షతో సర్వత్రా అభివృద్ధి ప్రణాళికలు రచించి చర్యలు చేపట్టారు. పలు సంక్షేమ, ప్రజోపయోగ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ అభివృద్ధికి బాటలు వేస్తున్నరు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు పకడ్బందీగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న ప్రజలు కేసీఆర్‌ను ‘మహానుభావుడు’ అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ‘సకల జనుల క్షేత్రం’ అని, మరికొందరు ప్రజలు సీఎం కేసీఆర్‌ను ‘దేవుడు, ఆ సారుకు రుణపడి ఉంటం, మంచి ఆలోచనాపరుడు’ అని కీర్తిస్తున్నరు.
రాష్ట్రవ్యాప్తంగా పలు పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వాటిలో ప్రధానమైన పథకం ‘ఆసరా’ పింఛన్ పథకం. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా, డయాలసిస్ పేషెంట్లు ఈ పథకం ద్వారా నెలనెలా పింఛన్‌తో లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో వందల రూపాయల్లో ఉన్న పింఛన్లను సీఎం కేసీఆర్ వేల రూపాయల వరకు పెంచిన్రు. భర్త చనిపోయినవారు, ఒంటరి మహిళలకు ఈ పథకం ఆసరాగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నెలనెలా వారికి పింఛను ఇస్తున్నరు. గతంలో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,016 వరకు పెంచి వారికి ఆసరాగా నిలిచిన్రు. భర్త చనిపోతే భార్యకు వెంటనే +అందించేందుకు ప్రభుత్వం ఈ జనవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి భార్య (18 ఏండ్లు నిండినవారు) ఆధార్ కార్డు, మృతుడి డెత్ సర్టిఫికెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపించి మృతుడి భార్యకు పింఛన్ మంజూరు చేసేలా ‘ఆసరా’ పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
తోడూ – నీడ లేని జీవితాలకు ప్రభుత్వం ‘ఆసరా’గా నిలవాలని వితంతువులు, ఒంటరి మహిళలను కూడా ఈ పథకంలోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు 91,662 మంది ‘ఆసరా’ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 18 ఏండ్లు నిండిన వితంతువులు జల్లాలో 85,165 మంది., ఒంటరి మహిళలు 6,497 మంది ఉన్నారు. వీరంతా నెలకు రూ.2,016లను తెలంగాణ ప్రభుత్వం నుంచి పింఛన్‌గా పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా కోణంలో భాగంగా పేదలు, నిర్భాగ్యులు, తోడు లేని వారందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన జీవనం అందించాలని, సమాజంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో ఈ పింఛన్లను బ్యాంకుల ద్వారా, ఇంకా పోస్టల్ సేవల ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్నది.
నా భర్త సచ్చిపోయి చానా ఏండ్లయ్యింది. అప్పటి నుంచి తెలంగాణ రాక ముందున్న పెభుత్వాలు ఇచ్చే రూ.200 దేనికీ సరిపోయేది కాదు. తెలంగాణ వచ్చినంక, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక రూ.2,016 ఇస్తున్నరు. నా కుటుంబానికి ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నయి. మునుపు పెద్ద పెద్ద పార్టీలోళ్లు పెభుత్వాలు నడిపిండ్రు. గాని, జనానికి, మాలాంటోళ్లకు ఇంత ఉపయోగపడే పథకాలు తీసుకురాలె. కేసీఆర్ సారు మంచి ఆలోచనాపరుడు. ఇంత మంచి చేసే కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– బయ్యని బాలమణి, నందిగామ
నా భర్త ఉన్నన్ని రోజులు నా భర్తకు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఆయన పోయినంక కొంచెం ఆలస్యమైంది. అయినా, నాకు ఇప్పుడు రూ.2,016 పింఛన్ వస్తున్నది. పెభుత్వం ఇస్తున్న పింఛన్ నాకెంతో ఆసరాగా ఉంటున్నది. నా తీరున ఎంతో మంది పింఛన్ అందుకుంటున్నరు. మొగుడు పోయినోళ్లు, ఒంటరిగా మిగిలినోళ్లను కేసీఆర్ సారు గుర్తుంచుకొని నెలనెలా పింఛన్ ఇస్తుండు. ఆయన చేస్తున్న సాయం ఇంతకు ముందు ఎవ్వరూ చేయలె. ఇంతకు మందు ఇంత ఇచ్చేటోళ్లు కాదు. కేసీఆర్ సార్‌కు, తెలంగాణ పెభుత్వానికి మా అసుంటోళ్లు రుణపడి ఉంటరు.
మా అసువంటి ఒంటరిగా ఉండే ఆడోళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గీ పథకం తీసుకొచ్చుడు చానా బాగుంది. నెలకోసారి సారు పేరు జెప్పుకొని రూ.2,016 తీసుకుంటున్నం. ఏదో రకంగా మా కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతున్నయి. ఎన్నో పెబుత్వాలొచ్చినా.. మమ్ముల్ని పట్టించుకున్నోడే లేడు. మమ్ముల్నే కాకుండా ఎంతో మందిని ఆదుకుంటున్న కేసీఆర్ సారు మంచిగుండాలె. ఆయనిచ్చే నెల పింఛన్‌తోనే ఇంత కలో గంజో తాగుతున్న. వయసు పెరుగుతున్న కొద్దీ కాళ్లు చేతులు ఆడట్లేదు.
– పార్వతమ్మ, తలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలని ‘ఆసరా’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సామాజిక సంక్షేమ పథకాల్లో అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోయేలా సీఎం కేసీఆర్ కార్యాచరణ చేపట్టారు. ‘ఆసరా’ ద్వారా జిల్లావ్యాప్తంగా 9 రకాల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతున్నది. జిల్లాలో 2,04,206 మంది ‘ఆసరా’ పెన్షనర్లు ఉన్నారు. వారిలో వితంతువులు (85,165), ఒంటిరి మహిళలు (6,497) 91,662 మంది ఉన్నారు.
– ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి