సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు దారి తప్పారు.. వ్యసనాలకు అలవాటుపడి.. డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు…ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ.1.53 లక్షల విలువ చేసే 30 ఎల్ఎస్డీ బ్లాస్ట్‌లు, 5.77 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ తిరుపతి యాదవ్ కథనం ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన దత్తిలితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు కేంద్రంగా గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ తిరుపతి తన బృందంతో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న దత్తిలితిన్, అభిరామ్, కొడాలిలను అరెస్టు చేశారు.
వ్యసనాలకు అలవాటుపడి డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను హైదరాబాద్ డీటీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ శిరీష కథనం ప్రకారం.. చరణ్ తేజ్, కౌశిక్ తూబోటి, సయ్యద్ సర్ఫరాజ్ చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు.
వ్యసనాలకు అలవాటు పడిన వీరు.. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నారు. చెన్నై నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరుణ్‌రాజ్ ద్వారా సరుకు కొనుగోలు చేసి, నగరంలో అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న డీటీఎఫ్ బృందం గురువారం జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్‌నం.37లో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ముగ్గురు విద్యార్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది.