యాచారం, జూన్ 11 : రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాచారం మండల పరిధిలోని మాల్ దాటగానే ఎస్సార్ పెట్రోల్ బంక్ సమీపంలో నాగార్జునసాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ నందీశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం..
హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు కలిసి నల్లగొండ జిల్లాలోని వైజాగ్ కాలనీ (సాగర్ బ్యాక్ వాటర్)లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. వారు అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో యాచారం మండలం మాల్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో బాలానగర్‌కు చెందిన కారు డ్రైవర్ వాస సాయితేజ(24), బీయన్ రెడ్డి నగర్ వనస్థలిపురానికి చెందిన వాస పవన్‌కుమార్(26), వాస రాఘవేందర్(22) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాలానగర్‌కు చెందిన వాస శివకుమార్(22), వాస సాయికుమార్(29), ఎం.సందీప్(25), ఈ.శివకుమార్(23) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు, పోలీసులు దవాఖానకు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.