రంగారెడ్డి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకొస్తున్నది. గతంలో జిల్లా లో 16 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష న్లుండగా.. ఇటీవల అవుటర్ రింగ్ రోడ్డు లోప లి మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ప్రస్తుతం జిల్లాలో ఆరు మున్సిపాలిటీలే మిగిలాయి.
వాటిలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి పోటీ తీవ్రంగా నెలకొన్నది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని రీతిలో సర్పంచ్ స్థానాలను చేజిక్కుంచుకోవడంతో.. అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్ తదితరుల ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు.
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలే..
జిల్లాలో ప్రస్తుతం ఆరు మున్సిపాలిటీలు మాత్ర మే ఉన్నాయి. గతంలో 16 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లుండగా.. వాటిలో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, ఆమనగల్లు, చేవెళ్ల, కొత్తూరు మున్సిపాలిటీలుండగా.. వాటిలో సుమారు 150 వరకు కౌన్సిలర్ వార్డులున్నాయి. ఈ వార్డుల్లో అత్యధికంగా విజయం సాధించి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఆశావహుల జాబితాను సిద్ధం చేసింది. సర్వే ఆధారంగా టికెట్లు కేటాయింపు జరుగుతుందని పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు.
పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో..
జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. జిల్లాలో 526 గ్రామపంచాయతీలుండగా.. అందులో 200లకు పైగా పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని మున్సిపల్లోనూ సత్తా చాటాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రిజర్వేషన్ల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఈసారి పోటీలో ఉండేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకొస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు జాబితా పొందుపర్చడంతోపాటు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలనూ గుర్తించింది.