మత్స్యకారుల ఉపాధిని ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మత్స్యకారులు వాటిని పెంచి.. విక్రయించి మంచి లాభాలు గడించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటివరకూ చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియకు ఊసే లేదు. ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను ప్రభుత్వం వదులుతుందా..? లేదా..? అనే అనుమానాలు మత్స్యకారుల్లో వ్యక్తమవుతున్నాయి.
-ఇబ్రహీంపట్నం, మే 31
రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. వాటి విస్తీర్ణం సు మారు 15 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210కి పైగా మత్స్యకార సహకార సంఘాలున్నాయి. అందులో 15,000 మంది చేపలు పట్టి, విక్రయించి ఉపాధిని పొందుతున్నారు. 2016-17లో గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి శ్రీకా రం చుట్టింది. అప్పటి నుంచి క్రమం తప్పకుం డా ప్రతిఏటా మత్స్యకార సొసైటీలకు ఉచితం గా చేపపిల్లలను పంపిణీ చేసి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేసింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వేలాది మంది మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతు న్నా చేప పిల్లలను పంపిణీ చేయడంలేదని.. మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది మే నెలలోనే చేపపిల్లలను కొనేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచేది. వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరగానే మత్స్యకారులకు ఆ శాఖ అధికారులు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది మే నెల పూ ర్తైనా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. చేపపిల్లల కొనుగోలుకు టెండర్లు పిలవాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడంలేదని.. దీంతో ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీ లేనట్టేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపా ధిని దెబ్బతీయొద్దని.. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో వర్షాలు ప్రారంభమై ఇప్పటికే అన్నదాతలు పొలంబాట పట్టారు. జలాశయాల్లో నీరు చేరే సమయానికి ఉచిత చేప పిల్లలను వదిలే అవకాశం ఉంటుం దో, లేదో అన్నది అనుమానంగా ఉన్నది. నేటికీ చేప పిల్లల టెండర్ల ప్రక్రియ మొదలు కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైం ది. ఏటా జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపపిల్లల పంపిణీ జరిగేది. అప్పటి వరకు వర్షాలు పుష్కలంగా కురిసి చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ సమయంలో చేపపిల్లలను వదిలితే అవి చక్కగా ఎదిగేందుకు అవకాశం ఉంటుండడంతోపాటు ఎదిగిన చేపల విక్రయాల ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఆలస్యంగా చేస్తే చేపలు ఎదగడం కష్టమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకం చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని, దాంతో చేపపిల్లలు ఎదగడం లేదన్న ఆరోపణలున్నా నేపథ్యంలో.. ప్రభుత్వం మత్స్యకార సొసైటీల్లో నేరుగా డబ్బులు జమచేస్తే ఆరోగ్యకరమైన చేప పిల్లలను కొంటామని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. దాంతో అవి సరిగ్గా ఎదగడం లేవు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నేరుగా మత్స్యకారుల సొసైటీ ఖాతాల్లో డబ్బులు జమచేస్తే.. మత్స్య కారులు నాణ్యమైనవి కొనుగోలు చేసి చెరువుల్లో వదిలితే మంచిగా ఉంటుంది.
-చెనమోని శంకర్, మత్స్యకార సంఘం జిల్లా నాయకుడు