కొత్తూరు, డిసెంబర్ 2 : అభివృద్ధికి ఆమడ దూరంలో తండాలను పంచాయతీలుగా మార్చడంతో వాటి దశ మారింది. అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలు నేడు అభివృద్ధికి చిరునామాలుగా మారాయి. ఇప్పుడు స్వయం పాలన, తండాలోనే సర్పంచ్తు, పంచాయతీ కార్యదర్శులు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసుకుంటున్నారు. కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండా నూతన పంచాయతీగా ఏర్పడింది. మొత్తం గ్రామంలో 713 మంది జనాభా, 150 కుటుంబాలు ఉన్నాయి. ఎమ్మెల్యే నిధులు రూ. 25 లక్షలతో పాటు రూ. 2 లక్షల జీపీ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, జడ్పీ నిధులు రూ. 5 లక్షలతో డ్వాక్రా భవనాన్ని నిర్మించారు. దీంతోపాటు జడ్పీ నిధులు రూ. 5 లక్షలు, ఎంపీటీసీ నిధులు రూ. 4 లక్షలను కలుపుకుని పంచాయతీ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. రూ. 2 లక్షల జీపీ నిధులతో డంపింగ్‌యార్డు నిర్మించారు.
పల్లెంతా పచ్చని చెట్లు..
మల్లాపూర్ తండాలో ఊరంతా పచ్చని చెట్లే. పల్లె ప్రకృతి వనం నిర్మాణంతో పల్లెకే కొత్తందం వచ్చింది. రోడ్ల వెంబడి, ఖాళీ ప్రదేశాల్లో 10 వేల వరకు మొక్కలు నాటారు. గ్రామ నర్సరీలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. నిత్యం ఇంటింటికీ ట్రాక్టర్‌తో వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. మిషన్ భగీరథలో భాగంగా 7 కేఎల్ సామర్థ్యంతో 5 ట్యాంకులను నిర్మించి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
తండాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం..
తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మల్లాపూర్ తండా పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశాం. ఎమ్మెల్యే సహకారంతో తండాను అందంగా తీర్చిదిద్దాం.
– పన్నింటి మధుసూదన్‌రెడ్డి, ఎంపీపీ, కొత్తూరు
మరింత అభివృద్ధికి కృషి చేస్తా..
ఎమ్మెల్యే, ఎంపీపీ, గ్రామ పాలకులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. పల్లె ప్రగతి, ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశాం. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం నిర్మించాం.
– రవినాయక్, సర్పంచ్, మల్లాపూర్ తండా
పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత…
మల్లాపూర్ తండాలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 4 వేల మొక్కలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో సుమారు 10,000 మొక్కలు నాటాం. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం.
-దశరథ్‌నాయక్, ఉప సర్పపంచ్, మల్లాపూర్ తండా