ఆదిబట్ల, జనవరి 25 : ఎట్టకేలకు ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన ఒక్కరు చైర్పర్సన్ కొత్త ఆర్తిక, వైస్ చైర్పర్సన్ కళమ్మపై అవిశ్వాసం పెట్టాలని తీర్మానం చేసి ఆ ప్రతిని కలెక్టర్‌కు 20 రోజుల క్రితం అందించారు. కాగా గురువారం కలెక్టర్ శశాంక ఫిబ్రవరి 9న ఉదయం 10:30 గంటలకు ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్, 12 గంటలకు వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తోపాటు మరో 13 మంది కౌన్సిలర్లకు విడివిడిగా నోటీసులు జారీ చేశారు.
ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మర్రి నిరంజన్‌రెడ్డి .. తమ పార్టీకే చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్తికపై అవిశ్వాసం పెట్టాలని మిగతా కౌన్సిలర్లను ఉసిగొల్పారు. ఇందుకోసం కొంతమంది సభ్యులను విహారయాత్రలకు తీసుకెళ్లాడు. కాగా అతడితోపాటు కాంగ్రెస్ పార్టీకే చెందిన యాదగిరి, అర్చన, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్పర్సన్ కళమ్మ సైతం చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 9న చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవ్వరినీ వరిస్తాయో తెలియనున్నది.