రంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం నేటితో ముగియనున్నది. ఈ ఏడాది ఫిబ్రవరితో సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది.
ఆరు నెలలు కూడా గురువారంతో ముగియనుండటంతో మరో ఆరు నెలలు పొడిగించడంపై జీవో జారీచేసే అవకాశాలున్నాయి. సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారని పలువురు ఆశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా పదవీ కాలం పొడిగింపునకే మొగ్గు చూపుతున్నది. న్నికలు నిర్వహిస్తే పలువురు రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు లభించనున్నాయి.
జిల్లావ్యాప్తంగా 56 సహకార సంఘాలు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 56 సహకార సంఘాలున్నాయి. పాలకవర్గాలకు 56 సహకార సంఘం చైర్మన్లతోపాటు వైస్ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు. పదవీ కాలం ముగిసినందున ఎన్నికలు నిర్వహిస్తే మరో 56 మందికి చైర్మన్, 56 మందికి వైస్ చైర్మన్ పదవులు లభించే అవకాశాలున్నాయి. సహకార సంఘాల పరిధిలో 1.25 లక్షల మందికి పైగా రైతులు సభ్యులుగా ఉన్నారు.
వీరంతా సహకార సంఘాల పాలక వర్గాల ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారు. రైతులకు రుణాలు ఇప్పించడంతోపాటు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించడంలో సహకార సంఘాలు దోహదపడుతున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసే కార్యక్రమాలను సహకార సంఘాలు చేపడుతున్నాయి.
ప్రస్తుతమున్న సహకార సంఘాలు రైతులకు సరిపోవడం లేదని, కొత్తగా మరిన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రైతుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కొత్తగా మరో 16 సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు త్వరలోనే కొత్తగా మరో 15 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నది.
వెంటనే ఎన్నికలు నిర్వహించాలి
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలం ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీతో పాటు పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతమున్న సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ఇప్పటికే ఒకసారి పొడిగించారు. మరోమారు పొడిగించకుండా ఎన్నికలు జరపాలని ఒత్తిడి పెరుగుతున్నది.
జిల్లాలో సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం పొడిగించడం వలన రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని, ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా వచ్చే పాలకవర్గాలు రైతుల అభివృద్ధికి పాటుపడుతాయని పలువురు భావిస్తున్నారు. కాగా, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సహకార సంఘాల చైర్మన్లే అధికంగా ఉన్నారు. వీరు తమ పదవులను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్లో చేరారు. జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య సైతం కాంగ్రెస్లో చేరి తన పదవిని నిలబెట్టుకున్నారు.